ముఖాల గుర్తింపు సాఫ్ట్‌వేర్‌లో లోపాలా!? | How Does Facial Recognition Works! | Sakshi
Sakshi News home page

ముఖాల గుర్తింపు సాఫ్ట్‌వేర్‌లో లోపాలా!?

Published Sat, Oct 19 2019 5:39 PM | Last Updated on Sat, Oct 19 2019 6:01 PM

How Does Facial Recognition Works! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌’. ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానంగా దీన్ని పేర్కొనవచ్చు. ఆధార్‌ కార్డు మొదలుకొని, విమానాశ్రయాల్లో ప్రయాణికుల స్క్రీనింగ్‌  వరకు అత్యాధునిక అవసరాల కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల నుంచి ఫేస్‌బుక్‌ ఖాతాల వరకు సేఫ్టీ ఫీచర్‌గా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సాంకేతిక పరిజ్ఞానం నిక్కచ్చిగా పని చేస్తుందా ? ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని ‘యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌’ పరిశోధకులు భావించారు. 

ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన నాలుగు పెద్ద ఐటీ సంస్థలకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సేకరించిన 2,450 మంది ముఖాల ఫొటోలను పంపించి తమకు కావాల్సిన సమాచారాన్ని కోరారు. వారి లింగాన్ని, అంటే ఆడ, మగలను గుర్తించాల్సిందిగా తెలిపారు. ఇప్పుడు లింగ మార్పిడి చేసుకున్న వారిని మూడో లింగంగా గుర్తిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఫేసియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీలో మూడో లింగాన్ని గుర్తించే అంశమే లేదు. అందుకని పరిశోధకులు కొందరు ట్రాన్స్‌ జెండర్ల ఫొటోలను కూడా పంపించి వారు ఇప్పుడు మగవారా ? ఆడవారా ? అన్న అంశాన్ని సాఫ్ట్‌వేర్‌ ద్వారా తేల్చాల్సిందిగా కోరారు. 

ట్రాన్స్‌జెండర్ల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం 38 శాతం పొరపాటు పడింది. ఆడవాళ్ల విషయంలో ఎక్కువ కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఆడవాళ్లలో 98.3 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించగా, మగ వాళ్ల విషయంలో 97.6 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. అంటే మహిళల ముఖాలను గుర్తించడంలో రెండు శాతం కన్నా తక్కువ, మగవాళ్ల విషయంలో మూడు శాతం కన్నా తక్కువ పొరపాటు పడింది. ఈ మాత్రం పొరపాటు మనుషులే పడుతున్నప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం పడదా ? అని దాన్ని అభివృద్ధి చేసిన ఐటీ సంస్థలు వాదిస్తున్నాయి. మగవారిలాగా ఆడవారి దుస్తులు మారిన నేటి సమాజంలో మనం కూడా పొరపాటు పడడం సహజమే కదా!. అమెజాన్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, క్లారిఫై సంస్థలు ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వాటిని వినియోగ సంస్థలకు అందిస్తున్నాయి. 

పనిచేసే విధానం 
ఈ సాంకేతిక పరిజ్ఞానం స్మార్ట్‌ డిజిటల్‌ వీడియో ద్వారా పనిచేస్తుంది. తన ముందుకు ఓ వ్యక్తి వచ్చినట్లయితే అదే పోలికలు ఉన్న వ్యక్తి లేదా ఆయన ఫొటో ఇంతకుముందు తన ముందుకు వచ్చిందా ? అన్న అంశంపై ఆధారపడి వ్యక్తులను గుర్తిస్తుంది. అంటే పాత ఫొటోతో కొత్త ఫొటోను పోల్చి చూస్తుంది. ఇలా పోల్చడంలో భిన్న వ్యక్తుల మధ్య సూక్ష్మ తేడాలను కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి వ్యక్తికి మధ్య  కళ్లు, ముక్కు, బుగ్గలు, నోరు వద్ద దాదాపు 80 రకాల సూక్ష్మ తేడాలు ఉంటాయి. ముక్కు ఎంత వెడల్పుగా ఉందో, కనుగుడ్లు ఎంత లోతుగా ఉన్నాయో, రెండు కళ్ల మధ్య దూరం ఎంతో, రెండు కళ్ల మధ్య ముక్కు ఎంత దూరంలో ఉందో, ముక్కుకు నోటికి మధ్య దూరం, కళ్లకు బుగ్గలు, నోరు మధ్య దూరం, మొత్తంగా ఒకదానికి  ఒకటి ఎంతో దూరంలో అవయవాలున్నాయో డిజిటల్‌ వీడియో కచ్చితమైన లెక్కలు వేసి వ్యక్తులను గుర్తిస్తుంది. ఎంతటి కవల పిల్లలలోనైనా ముఖంలోని ఈ అవయవాలన్నీ ఏకరీతిగా, సమానమైన దూరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. 

అందుకని వ్యక్తులను గుర్తించడంలో పెద్దగా పొరపాట్లు ఉండవు. కానీ ఓ వ్యక్తి పాత, కొత్త ఫొటోలను పోల్చినప్పుడు అవి ఎంత దూరం నుంచి తీశారో, అంటే మొదటి ఫొటో నాలుగు అడుగుల దూరంలో ఉన్నప్పుడు తీస్తే, ప్రస్తుత ఫొటో రెండడుగుల దూరం నుంచి తీస్తే కొంత పారపాటు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రధాని కెమేరా లేదా వీడియో లెన్స్‌ పరిధిలోకి ఓ వ్యక్తి ముఖం ఎంత స్పష్టత పరిధిలోకి వచ్చిందనే విషయంపైనే కచ్చితత్వం ఎక్కువ ఆధార పడి ఉంటుందని వారంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఆడ, మగ లింగ భేదాలను గుర్తించడంలో మరింత కచ్చితత్వం కోసం గూగుల్‌ సంస్థ ప్రయత్నించి విరమించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement