10 అతిపెద్ద సర్వీసు కంపెనీల్లో మనవి మూడు
Published Wed, Jun 7 2017 1:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
బెంగళూరు : టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రపంచంలో 10 అతిపెద్ద ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీల్లో భారత్ కు చెందిన ఈ టెక్ దిగ్గజాలు టాప్ లో నిలిచాయి. అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం బిలియన్ డాలర్లకు పైగా రెవెన్యూలు ఆర్జిస్తూ ఇవి 10 అతిపెద్ద ఇంజనీరింగ్ సర్వీసు కంపెనీల్లో కొనసాగుతున్నట్టు తెలిసింది. 2015 అధ్యయనంలో టీసీఎస్, విప్రోలు బిలియన్ డాలర్లకు కొంచెం తక్కువగా రెవెన్యూలు ఆర్జించాయని హెచ్ఎఫ్ఎస్ అంచనావేసింది. కానీ ఈసారి ఈ మూడు టెక్ దిగ్గజాలు బిలియన్ డాలర్లకు పైగా రెవెన్యూలు ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది.
ఫ్రెంచ్ సంస్థలు ఆల్ట్రాన్, ఆల్టెన్ లు ఈ ర్యాంకింగ్స్ లో మళ్లీ టాప్ స్థానాలను దక్కించుకున్నాయి. హెచ్సీఎల్, టీసీఎస్, విప్రోలు ఐదు, ఏడు, ఎనిమిదవ స్థానాల్లో నిలిచినట్టు హెచ్ఎఫ్ఎస్ అధ్యయనం పేర్కొంది. గత ఆరేళ్ల డేటాతో పోలిస్తే 1బిలియన్ పైగా డాలర్ల క్లబ్ లో ఎనిమిది కంపెనీలు ఉన్నాయి. హెచ్ఎఫ్ఎస్ ప్రకటించిన అధ్యయనంలో హెచ్సీఎల్ రెవెన్యూలు 1.23 బిలియన్ డాలర్లు ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది ర్యాంకింగ్ లో ఇది నాలుగో స్థానంలో ఉంది.
Advertisement