
ఆకర్షణీయ ధరలో హెచ్‌సీఎల్ టెక్ బైబ్యాక్
ఒక్కో షేరుకు రూ.1,000.. 17% అధికం
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన హెచ్‌సీఎల్ టెక్ షేర్ల బైబ్యాక్ ధరను ప్రకటించింది. మార్కెట్ ధర కంటే 17 శాతం ప్రీమియంతో ఒక్కో షేరును రూ.1,000 ధరకు బైబ్యాక్ చేయనున్నట్టు తెలియజేసింది. ప్రపోర్షనేట్ విధానంలో టెండర్ ఆఫర్ ద్వారా దీన్ని నిర్వహించనున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. రూ.3,500 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది.
కంపెనీ ఈక్విటీలో ఇది 16.39 శాతానికి సమానం. బైబ్యాక్‌కు వెచ్చిస్తున్న నిధులు కంపెనీ రిజర్వ్ నిధుల్లో 13.62 శాతానికి సమానం. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.854.85 దగ్గర క్లోజ్ అయింది. బైబ్యాక్ ఆఫర్‌కు ఈ నెల 25ను రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది. టీసీఎస్ రూ.16,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించగా, ఇన్ఫోసిస్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.