హెచ్‌సీఎల్ టెక్ లాభంలో 28% వృద్ధి
1:1 నిష్పత్తిలో బోనస్
న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 28 శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 1,915 కోట్లుగా నమోదైంది. క్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,496 కోట్లు. ఇంజనీరింగ్ సర్వీసులు వృద్ధి చెందడం, డిజిటల్ సేవలపై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుండటం ఇందుకు దోహదపడిందని హెచ్‌సీఎల్ తెలిపింది.
రూ. 2 ముఖ విలువ గల షేరుపై రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు కూడా జారీ చేయాలని నిర్ణయించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. తాజా క్యూ2లో ఆదాయాలు 13.4 శాతం వృద్ధి చెంది రూ. 9,283 కోట్లకు పెరిగినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా తెలిపారు.
ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఐటీ సేవల పరిధి మరింతగా పెరుగుతోందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ నాడార్ తెలిపారు. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వీసులు అందిస్తున్న తమ సంస్థ వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయన్నారు. క్యూ2లో హెచ్‌సీఎల్ ఉద్యోగుల సంఖ్య నికరంగా 4,718 పెరిగి 1,00,240కి చేరింది.
బంపర్ ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 9% ఎగబాకి రూ.1,794 వద్ద ముగిసింది.