ముంబై: ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ రేపో రేటును గణనీయంగా తగ్గించడం ఫలితంగా బ్యాంకులు రుణాలపై రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐతోపాటు పీఎన్‌బీ రుణ రేట్లను తగ్గించగా.. తాజాగా బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే 0.05 శాతం. సవరణ తర్వాత ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ రేటు 7.30 శాతానికి, ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేటు 7.35 శాతానికి, ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ (రిటైల్ రుణాలకు ఎక్కువగా అమలయ్యేది) 7.65 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 7.85 శాతానికి దిగొచ్చినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించింది. సవరించిన రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొంది. బీవోబీ సైతం ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు (0.15 శాతం) తగ్గించింది. ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.80 శాతం నుంచి 7.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 7.65 శాతం నుంచి 7.50 శాతానికి దిగొచ్చాయి. ఈ రేట్లు ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తాయని బీవోబీ ప్రకటించింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లను 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 7.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 7.30 శాతం, ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 7.15 శాతానికి తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment