హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.2,204 కోట్లు
క్యూ1లో ఆదాయం రూ. 11,441 కోట్లు
న్యూఢిల్లీ : తనఖా రుణాలిచ్చే దేశపు అతిపెద్ద ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.2,204 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,873 కోట్ల నికర లాభం సాధించామని హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) తెలిపింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి వచ్చిన డివిడెండ్ల కారణంగా ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత ఏడాది జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమకు రూ.269 కోట్ల డివిడెండ్‌ను చెల్లించిందని, ఈ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఖాతా పుస్తకాల్లో నమోదు చేశామని వివరించింది.
అలాగే ఈ ఏడాది జూలైలో రూ.315 కోట్ల డివిడెండ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెల్లించిందని, దీనిని జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తామని పేర్కొంది. అందుకనే గత క్యూ1, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక గత క్యూ1లో రూ.10,056 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.11,441 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే గత క్యూ1లో రూ.1,345 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ1లో రూ.1,361 కోట్లుగా నమోదైందని పేర్కొంది.
ఆదాయం రూ.6,461 కోట్ల నుంచి రూ.7,068 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఈ క్యూ1లో హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఈ షేర్ బీఎస్‌ఈలో 2.3 శాతం క్షీణించి రూ.1,304 వద్ద ముగిసింది.