కొటక్ మహింద్రా బ్యాంకు (ఫైల్ ఫోటో)
ముంబై : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాను కొటక్ మహింద్రా బ్యాంకు బీట్ చేసింది. తొలిసారి ఎస్‌బీఐని అధిగమించిన కొటక్ మహింద్రా దేశంలో రెండో అత్యంత విలువైన బ్యాంకుగా చోటు దక్కించుకుంది. బీఎస్‌ఈ డేటాలో కొటక్ మహింద్రా బ్యాంకు షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 1.7శాతం పెరగడంతో, ఈ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,22,560.69 కోట్లకు పెరిగినట్టు వెల్లడైంది. కొటక్ మహింద్రా బ్యాంకు షేర్లు గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఆల్-టైమ్ హైలో రికార్డవుతున్నాయి.
ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,22,043.74 కోట్లకే పెరిగినట్టు బీఎస్‌ఈ డేటాలో తెలిసింది. ప్రస్తుతం ఎస్‌బీఐ షేర్లు గత సెషన్ ముగింపుకు 1 శాతం నష్టంలో ట్రేడవుతున్నాయి. కాగ, రూ.5.04 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలో అత్యంత విలువైన బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లిమిటెడ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఉదయ్ కొటక్ చెందిన కొటక్ మహింద్రా బ్యాంకు షేర్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు చెప్పారు. ఈ బ్యాంకు వ్యాపారాల్లో మెరుగైన వృద్ధి, స్థిరమైన ఆస్తుల నాణ్యత, నికర నిరర్థక ఆస్తుల్లో 1శాతం రేషియో వంటి వాటితో ఈ బ్యాంకింగ్ షేర్లను పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది.
కొటక్ మహింద్రా బ్యాంకుకు చెందిన 37 బ్రోకర్లను ట్రాక్ చేయగా.. 26 మంది కొనుగోలుకు రికమండ్ చేయగా.... నలుగురు ‘సెల్’ కు , 7గురు ‘హోల్డ్’ రేటింగ్‌ను ప్రతిపాదించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఫిబ్రవరి 14న వెలుగు చూసిన రూ.13,500కోట్ల భారీ కుంభకోణం అనంతరం ఎస్బీఐతో పాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడవడం ప్రారంభమయ్యాయి. పీఎన్‌బీ స్కాం అనంతరం ఎస్‌బీఐ షేర్లు సుమారు 10 శాతం కిందకి పడిపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ 18.4 శాతం కిందకి దిగజారింది. ఈ కుంభకోణాలు మాత్రమే కాక, ఎస్‌బీఐ తన డిసెంబర్ క్వార్టర్‌లో రూ.2413 కోట్ల నష్టాలను నమోదు చేయడంతో, ఈ షేరు ఒత్తిడిలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment