హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 20% అప్
♦ నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధి
♦ ఒక్కో షేర్‌కు రూ.9.5 డివిడెండ్
ముంబై: ప్రైవేట్ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,374 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.2,807 కోట్లు)తో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటంతో నికర లాభం 20 శాతం పెరిగిందని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేశ్ సుక్తాంకర్ పేర్కొన్నారు. 2014-15 క్యూ4లో రూ.6,013 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం 2015-16 క్యూ4లో 24 శాతం వృద్ధితో రూ.7,453 కోట్లకు ఎగసిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.15,570 కోట్ల నుంచి రూ.18,863 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆస్తులు 27 శాతం, నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. స్థూల మొండిబకాయిలు 0.94 శాతంగా, నికర మొండి బకాయిలు 0.3 శాతంగా ఉన్నాయని తెలిపారు. కేటాయింపులు రూ.577 కోట్ల నుంచి రూ.663 కోట్లకు పెరిగాయని వివరించారు.
4-4.4 శాతం రేంజ్‌లో నిమ్
ఫీజు, కమీషన్ ఆదాయం రూ.1,835 కోట్ల నుంచి రూ.2,172 కోట్లకు పెరిగిందని సుక్తాంకర్ తెలిపారు. కంపెనీల నుంచి దీర్ఘకాలిక రుణాలకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.9.5 డివిడెండ్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు 4 నుంచి 4.4 శాతం రేంజ్‌లో కొనసాగించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తమ స్ప్రెడ్స్‌పై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని పేర్కొన్నారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే 2014-15లో రూ.10,216 కోట్లుగా ఉన్న నికర లాభం 2015-16 ఆర్థిక సంవత్సరానికి 20 శాతం వృద్ధితో రూ.12,296 కోట్లకు పెరిగిందని సుక్తాంకర్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.57,466 కోట్ల నుంచి రూ.70,973 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 0.1 శాతం లాభంతో రూ.1,092 వద్ద ముగిసింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పనితీరు బాగా ఉందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ చాయిస్ బ్రోకింగ్ తెలిపింది. అయితే స్థూల మొండి బకాయిలు 0.03% పెరగడం ఆశ్చర్యకరమని పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే బ్యాంక్‌కు ప్రయోజనం కలుగుతుందని వివరించింది.