హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.2,190 కోట్లు  | HDFC Q1 results today; Here's what to look for | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.2,190 కోట్లు 

Published Tue, Jul 31 2018 12:50 AM | Last Updated on Tue, Jul 31 2018 12:50 AM

HDFC Q1 results today; Here's what to look for - Sakshi

న్యూఢిల్లీ: హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,190 కోట్ల నికర లాభం (స్టాండ్‌ అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,424 కోట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. వడ్డీ ఆదాయం, నిర్వహణ ఆస్తుల్లో ఆరోగ్యకరమైన వృద్ధి కారణంగా ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.8,290 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.9,952 కోట్లకు పెరిగింది.  కార్యకలాపాల ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి రూ.9,884 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌ ఆర్థిక ఫలితాలను కంపెనీ వెల్లడించలేదు. 

నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్‌... 
గత క్యూ1లో రూ.2,412 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ1లో  20 శాతం వృద్ధితో రూ.2,890 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గిందని పేర్కొంది. లోన్‌బుక్‌ రూ.3,13,573 కోట్ల నుంచి రూ.3,71,573 కోట్లకు పెరిగిందని వివరించింది.  నిర్వహణ ఆస్తులు 18 శాతం వృద్ధితో రూ.3.52 లక్షల కోట్లకు ఎగిశాయని, మొత్తం రుణాల్లో 72 శాతం రుణాలు వ్యక్తిగత రుణాలేనని పేర్కొంది. వ్యక్తిగత రుణాలు 25 శాతం, రుణ మంజూరీలు 17 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది. స్థూల మొండిబకాయిలు 1.18 శాతంగా, నికర మొండిబకాయిలు 0.66 శాతంగా, వ్యక్తిగతేతర స్థూల మొండిబకాయిలు 2.32 శాతంగా ఉన్నాయని పేర్కొంది. కేటాయింపులు రూ.164 కోట్ల నుంచి రూ.20 కోట్లకు తగ్గాయని బ్యాంక్‌ తెలిపింది.  

భారీగా నిధుల సమీకరణ.. 
ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన బాండ్ల జారీ ద్వారా రూ.35,000 కోట్ల సమీకరణ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. అంతేకాకుండా విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) మార్గంలో 150 కోట్ల డాలర్ల నిధుల సమీకరణకు కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది.  

లాభాల స్వీకరణ.... 
ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ సోమవారం ఒకానొకదశలో జీవితకాల గరిష్ట స్థాయి... రూ.2,051ను తాకింది. అయితే, ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరకు 0.8 శాతం నష్టంతో రూ.2,028 వద్ద ముగిసింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement