
త్వరలో జీఎస్ టీ కార్యరూపం
♦ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ప్రక్షాళనపైనా దృష్టి
♦ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో జైట్లీ...
న్యూఢిల్లీ: ప్రస్తుత పరోక్ష పన్నుల వ్యవస్థ స్థానంలో ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) త్వరలో కార్యరూపం దాల్చుతుందన్న ధీమాను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. జైట్లీ గురువారం ఇక్కడ రెండు రోజల ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్‌టీ బిల్లుకు ప్రతిపక్షాలు తమ మద్దతును ఇస్తాయన్నది తన విశ్వాసమని తెలిపారు.
ప్రత్యక్ష పన్ను వ్యవస్థను ఆధునికీకరించడంపైనా ప్రభుత్వం దృష్టిసారిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. సంస్కరణలను నిరంతర ప్రక్రియగా పేర్కొన్న జైట్లీ... దీనికి ఒక ముగింపు రేఖ అంటూ ఏదీ ఉండదన్నారు. పలు అంశాలపై కాంగ్రెస్ పార్టీతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ బిల్లు రాజ్యసభలో పెండిం గులో ఉన్న సంగతి తెలిసిందే. దేశ మౌలిక, రైల్వేలు, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సావరిన్ ఫండ్స్‌కు జైట్లీ విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఇన్వెస్టర్ల సదస్సులో భాగంగా ఆర్థికమంత్రి సింగపూర్, యూఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఆర్థికశాఖ అధికారిక యూ ట్యూబ్ ఆవిష్కరణ
ఆర్థికమంత్రి గురువారం తన శాఖకుసంబంధించి అధికారిక యూ ట్యూబ్‌ను ఒకదానిని ఆవిష్కరించారు. ఆర్థిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికార వర్గాలకు అందుబాటులో ఉంచడం దీని ఉద్దేశం.