హాయ్ బోలో.. హలో రోబో! | hello robotics in Wikipedia new startup company | Sakshi
Sakshi News home page

హాయ్ బోలో.. హలో రోబో!

Published Sat, Oct 1 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

హాయ్ బోలో.. హలో రోబో!

హాయ్ బోలో.. హలో రోబో!

రోబోటిక్స్ వికీపీడియా హాయ్‌రోబో
ఒకే వేదికగా థియరీ, ప్రోగ్రామింగ్, కిట్స్ వంటివన్నీ విక్రయం
కాలేజీలు, స్కూళ్లలో రోబో ల్యాబ్స్ ఏర్పాటు, శిక్షణ
‘స్టార్టప్ డైరీ’తో హలో రోబో ఫౌండర్ రూపక్ జాడ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘చిట్టి’.. ఈ ముద్దు పేరు వినపడగానే ముందుగా గుర్తొచ్చేది రోబో సినిమా.. రజనీకాంత్ చేతిలో రూపుదిద్దుకున్న చిట్టి... రోబోనే! ఈ చిత్రంలో రోబోను తయారు చేసేందుకు రజనీ ఎంత కష్టపడ్డాడో తెర మీద చూశాం. అది సినిమా కాబట్టి రజనీ అలా.. అలా కానిచ్చేశాడు. మరీ, నిజంగానే రోబోను తయారు చేయాలంటే?

ఇదిగో ఇదే వ్యాపార వస్తువుగా మారి.. హైదరాబాద్ కేంద్రంగా ‘హలో రోబో’ పేరుతో స్టార్టప్ రూపుదిద్దుకుంది. సంస్థ సేవలు, విస్తరణ గురించి హలో రోబో ఫౌండర్ రూపక్ జాడ మాటల్లోనే..

చిన్నతనం నుంచే రోబోలను తయారు చేయడమంటే ఇష్టం. ఇంజనీరింగ్‌లో ప్రాజెక్ట్ వర్క్ కూడా దీని మీదే చేశా. స్నేహితులకూ హెల్ప్ చేసేవాణ్ణి. ఒక దశలో రోబో థియరీ, ప్రోగ్రామింగ్ చేయడం చాలా కష్టమయ్యేది. అప్పుడే అనిపించింది.. అసలు రోబోటిక్స్‌ను ఎడ్యుకేషన్‌లా అందిస్తే ఎలా ఉంటుందా అని. ఇంకేముంది రూ.2 లక్షల పెట్టుబడితో 2013లో హలో రోబో.కామ్‌ను ప్రారంభించా.

 రోబోటిక్స్ వికీపీడియా..
హలోరోబోలో ఏముంటాయంటే.. రోబోటిక్స్ గురించి నేర్పిస్తాం. థియరీ, ప్రోగ్రామింగ్, ఇన్‌స్టలేషన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తాం. రోబోలను తయారు చేసేందుకు అవసరమైన కిట్స్‌నూ విక్రయిస్తాం. ఒక్కముక్కలో చెప్పాలంటే రోబోటిక్స్‌కు వికీపీడియా లాంటిది ఈ హలో రోబో. ప్రస్తుతం మా దగ్గర రాబీ బేసిక్, అడ్వాన్స్, బ్లూ, ఆక్వా, ఆర్మ్, డ్రోన్‌లతో పాటూ ఆర్‌అండ్‌డీలో మరో 3 మొత్తంగా 10 రకాల రోబోలున్నాయి. రోబో కిట్స్ కొనుగోలు కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. కిట్స్ ప్రారంభ ధర రూ.1,200- 20 వేల వరకూ ఉంటుంది.

 వర్క్‌షాప్‌లు, శిక్షణ కూడా..
విద్యార్థి దశ నుంచే రొబోటిక్స్‌లో శిక్షణ ఇచ్చేందుకుగాను కళాశాలలు, పాఠశాలల్లో శిక్షణ, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నాం. మల్లారెడ్డి గ్రూప్‌కు చెందిన మూడు ఇనిస్టిట్యూట్స్‌లో, తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలో ల్యాబ్స్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ఇందుకోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం 15 కళాశాలలకు చెందిన విద్యార్థులు మా కస్టమర్లుగా ఉన్నారు. 30 వర్క్‌షాప్‌లు నిర్వహించాం.

 రూ.3 కోట్ల నిధుల సమీకరణ..
ఇప్పటివరకు సుమారు 350-400 రోబో కిట్స్‌ను విక్రయించాం. గత ఏడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 200 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఆరుగురు సభ్యులమున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో సొంతంగా ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తాం. విస్తరణ నిమిత్తం రూ.3 కోట్ల నిధులు అవసరం కావటంతో ఫండింగ్ కోసం చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో డీల్‌ను క్లోజ్ చేస్తాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement