సాక్షి : ముంబై: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 130కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ముందంజ దూసుకుపోతోంది. దీంతో ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి భారీ షాక్ తగిలింది. అంతేకాదు ఫలితాల సరళి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఖాయం అన్న సంకేతాలందిస్తున్న నేపథ్యంలో బాబు కుటుంబానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఫలితాల్లో టీడీపీ ఢమాల్ అనడంతో ఇన్వెస్టర్లు హెరిటేజ్ ఫుడ్స్ కౌంటర్లో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఈ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ. 475 వద్ద ముగిసిన హెరిటేజ్ షేర్ గురువారం ఓపెనింగ్‌లోనే పది శాతంపైగా నష్టపోయి రూ. 411కి పతనమైంది. ప్రస్తుతం 9శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఫలితాలు ముగిసే సమయానికి ఎన్నికల ఫలితాల ప్రభావంతో మరింత కుదేలయ్యే అవకాశం ఉందని మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు 13 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment