హీరోమోటో కార్ప్ లాభం 563 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 563 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 549 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 3% వృద్ధి. ఈ కాలంలో నికర అమ్మకాలు 14%పైగా పెరిగి రూ. 6,999 కోట్లను అధిగమించాయి. గతంలో రూ. 6,127 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
కాగా, ప్రస్తుత ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ ఇకపై వైస్‌చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ 10% అధికంగా 17,15,254 వాహనాలను విక్రయించింది. గతంలో 15,59,282 వాహనాలు అమ్ముడయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 30 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
వృద్ధిని కొనసాగిస్తాం
ఆటో పరిశ్రమ మందగించినప్పటికీ అమ్మకాల్లో వృద్ధిని కొనసాగించగలిగినట్లు ముంజాల్ పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇకపై రెండంకెల వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1% నష్టంతో రూ. 2,854 వద్ద ముగిసింది.