న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల అగ్రగామి సంస్థ హీరో మోటో కార్ప్ జూన్ త్రైమాసికం ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. నికర లాభం అర శాతం తగ్గి రూ.909 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం రూ.8,809 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.914 కోట్లు, ఆదాయం రూ.8,622 కోట్లుగా ఉన్నాయి. రాయిటర్స్ పోల్‌లో లాభం రూ.1,001 కోట్లు, ఆదాయం రూ.9,067 కోట్ల మేర ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. ప్రధానంగా రెండంశాలు కంపెనీ లాభాలను ప్రభావితం చేశాయి. తయారీ పరంగా హరిద్వార్‌లోని కేంద్రానికున్న పన్ను ప్రయోజనాలు ఈ ఏడాది మార్చితో ముగిసిపోయాయి. ఇక కమోడిటీ వ్యయాలు పెరిగిపోవడంతో ఎబిటా మార్జిన్ 15.6 శాతానికి పరిమితమైంది. అయితే, ఎబిటా మరీ పడిపోకుండా కంపెనీ ధరల పెంపు, వ్యయాలకు కోత వంటి చర్యలను తీసుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎబిటా 16.3 శాతంగా ఉంది. అయితే, క్రితం ఏడాది ఇదే కాలంలో జీఎస్టీ లేనందున, నాటి ఫలితాలతో పోల్చి చూడడం సరికాదని కంపెనీ పేర్కొంది.
సవాళ్లున్నా ముందుకే
‘‘అంతర్జాతీయ ధోరణులతో కమోడిటీ ధరల్లో అస్థిరతల కారణంగా వాహన పరిశ్రమపై గణనీయమైన ప్రభావం పడింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఈఏడాది మిగిలిన కాలంలో పరిశ్రమ వృద్ధి కొనసా గుతుంది. వర్షాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాలతో రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. రానున్న నెలల్లో ప్రీమియం మోటారు సైకిళ్లు, స్కూటర్ల విడుదలతో సానుకూల దిశగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
ఏథెర్ ఎనర్జీలో రూ.130 కోట్ల పెట్టుబడులు
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథెర్ ఎనర్జీలో మరో రూ.130 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 66,320 కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లు (సీసీడీ) ఏథెర్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. ‘‘సీసీడీల మార్పిడి తర్వాత ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో వాటా పెరుగుతుంది. ఈ లావాదేవీ ఆగస్ట్ 31కి పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో కార్ప్‌నకు 32.31 శాతం వాటా ఉంది.
కీలక గణాంకాలు ఇవీ...
►జూన్ త్రైమాసికంలో కంపెనీ 21,06,629 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల సంఖ్య 18,53,647గా నమోదైంది.
► హరిద్వార్ యూనిట్‌కు పన్ను మినహాయింపులు తీరిపోవడం వల్ల లాభంపై ప్రభావం పడినట్టు కంపెనీ తెలిపింది. పన్ను వ్యయాలు రూ.379 కోట్ల నుంచి రూ.433 కోట్లకు పెరిగాయి.
► ముడి పదార్థాల వ్యయాలు రూ.5,475 కోట్ల నుంచి రూ.6,131 కోట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment