
హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.477 కోట్లు
⇒ 14 శాతం క్షీణత
⇒ రూ.155 కోట్ల ఇంపెయిర్‌మెంట్ నష్టంతో తగ్గిన లాభం
⇒ క్యూ4 ఫలితాలు వెల్లడించిన కంపెనీ
⇒ ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్
న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం గత ఏడాది నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.477 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. తాము అమెరికా కంపెనీ ఇరిక్ బ్యూయల్ రేసింగ్‌లో...
రూ.155 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అయితే ఆ సంస్థ దివాళా పిటీషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు నష్టం వాటిల్లిందని, అందుకే నికర లాభం క్షీణించిందని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. నికర అమ్మకాలు రూ.6,513 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.6,794 కోట్లకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్‌ను చెల్లించనున్నామని చెప్పారు. గత ఆగస్టులో రూ. 30 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, మొత్తం మీద గత ఆర్థిక సంవ్సరంలో తమ డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.60కు చేరుతుందని వివరించారు.
ఇక విక్రయించిన వాహనాల సంఖ్య 15,89,462 నుంచి 15,75,501కు తగ్గిందని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాల విషయానికొస్తే, నికర లాభం రూ.2,109 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,386 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర అమ్మకాలు రూ.25,275 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.27,585 కోట్లకు, విక్రయించిన వాహనాల సంఖ్య 62,45,960 నుంచి 6 శాతం వృద్ధితో 66,31,826కు పెరిగాయని పేర్కొన్నారు.