హిందాల్కో నికరలాభం 25 శాతం అప్
న్యూఢిల్లీ: బేస్ మెటల్స్ ఉత్పాదక కంపెనీ హిందాల్కో నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 25% వృద్ధితో రూ. 502 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ.401 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 9,472 కోట్ల నుంచి రూ. 11,969 కోట్లకు చేరింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 182% వృద్ధితో రూ. 1,557 కోట్లకు చేరింది.
ఉత్పాదక వ్యయం తగ్గడం, అల్యూమినియం అమ్మకాల పరిమాణం, మార్జిన్లు అధికంగా వుండటంతో పూర్తి సంవత్సరంలో తమ ఇబిటా 25% వృద్ధితో రూ. 5,819 కోట్లకు పెరిగినట్లు హిందాల్కో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.39,383 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 1,02,631 కోట్లుకాగా, ఇబిటా 36% వృద్ధితో రూ.13,558 కోట్లకు పెరిగింది. రూ.1,900 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని నమోదుచేసింది.