హీరో, హోండాల మధ్య మైలేజీ చిచ్చు
⇒ ఐ స్మార్ట్ బైక్ మైలేజీ 102.5 కిమీ: హీరో మోటో
⇒ బేస్ ఇంజిన్ మేం తయారు చేసిందే, అంత మైలేజీ గ్యారంటీ లేదు: హోండా
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కొత్త బైక్ స్ప్లెండర్ ఐ స్మార్ట్ బైక్ లీటర్‌కు 102.5 కిమీ మైలీజినిస్తుందని హీరో మోటోకార్ప్ ప్రచారం హీరో మోటొకార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీల మధ్య వివాదం రేపుతోంది. ఇంత మైలేజీ వస్తుందని చెప్పడం వినియోగదారులను మోసం చేయడమేనని, ఇది వాస్తవ విరుద్ధమని హెచ్‌ఎంఎస్‌ఐ విమర్శించింది.
స్ప్లెండర్ బేస్ ఇంజన్‌ను తామే రూపొందించామని హోండా ఆర్ అండ్ డీ సెంటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీజి కస తెలిపారు. పూర్తి నియంత్రిత వాతావరణంలోనూ ఇంత మైలేజీ నిలకడగా కొనసాగించడం కష్టమని పేర్కొన్నారు. అయితే ఈ మైలేజీ వివరాలు ప్రభుత్వం ఆధీనంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఐ క్యాట్) ధ్రువీకరించినవేనని హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మైలేజీ వివరాలను సవాల్ చేయడమంటే భారత ప్రభుత్వం నెలకొల్పిన ప్రమాణాలు, నియమనిబంధనలను ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. హీరో గ్రూప్, హోండా కంపెనీలు తమ 26 ఏళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని 2010లో రద్దు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ రెండు కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.