హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్‌నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది.
ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్‌తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్‌ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్‌లైన్‌లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.
భారత్ స్టేజ్ ప్రమాణాలు..
భారత్‌లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్‌ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
భారీ పెట్టుబడులతో...
భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్‌గ్రెడేషన్‌కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది.
బీఎస్–6 వాహనాల క్యూ!!
Published Thu, Jun 20 2019 5:11 AM | Last Updated on Thu, Jun 20 2019 5:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment