2020 నాటికి బీఎస్‌–6 వాహనాలు! | Honda rolls out 50th lakh BS4 CB Shine, BS4 version launched | Sakshi
Sakshi News home page

2020 నాటికి బీఎస్‌–6 వాహనాలు!

Published Tue, Feb 7 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

2020 నాటికి బీఎస్‌–6 వాహనాలు!

2020 నాటికి బీఎస్‌–6 వాహనాలు!

హోండా మోటార్‌సైకిల్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ కీటా మురమత్సు  
ప్రస్తుతానికి మార్కెట్లో బీఎస్‌–4తో సీబీ హార్నెట్, షైన్‌ బైక్స్‌
ఈ నెలాఖరున మార్కెట్లోకి బీఎస్‌–4 తొలి స్కూటర్‌
పెద్ద నోట్ల ప్రభావం నుంచి పట్టణాల్లో కోలుకున్నాం
గ్రామాల్లో సాధారణ స్థితికి మరో మూడునెలలు పట్టొచ్చు
వంద శాతం ప్లాంట్ల వినియోగం తర్వాతే కొత్త ప్లాంట్‌


శ్రీనాథ్‌ అడెపు
హోండా మోటర్స్‌ త్వరలో దేశంలోని తన బైకులన్నిటినీ బీఎస్‌–4 ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చటానికి అన్నీ సిద్ధం చేసింది. అంతేకాక... మరో మూడేళ్లలో బీఎస్‌–6 ప్రమాణాలతో బైకులు తేవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఏ) ప్రెసిడెంట్, సీఈఓ కీటా మురమత్సు చెప్పారు. భారత్‌ స్టేజ్‌ –4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన సీబీ షైన్‌ను రాజస్థాన్‌లోని తపుకర ప్లాంట్‌లో విడుదల చేసిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదన్న మురమత్సు... తమ సంస్థ తరఫున కూడా డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించే చర్యలు మొదలు పెట్టినట్లు తెలియజేశారు. ఇంటర్వూ్య ముఖ్యాంశాలివీ...

అన్ని బైకులూ బీఎస్‌–4 ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నట్లున్నారు?
అవును! ఎందుకంటే రోజురోజుకూ కాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. బైకుల నుంచి కార్బన్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటి కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదలవుతాయి కాబట్టే 2017 నాటికి దేశంలోని వాహనాలన్నీ బీఎస్‌–4కు, 2020 నాటికి బీఎస్‌–6కు అప్‌గ్రేడ్‌ కావాలని కేంద్రం నిబంధనలు పెట్టింది. దానికి తగ్గట్టే మేం మార్పులు చేస్తున్నాం. గతంలో బీఎస్‌–4 హోండా సీబీ హార్నెట్‌ 160 ఆర్‌ బైక్‌ను విడుదల చేశాం. ఇపుడు సీబీ షైన్‌ను తపుకర ప్లాంట్‌లో తయారు చేసి విడుదల చేశాం.

మరి మిగిలిన బైకుల సంగతో..?
బీఎస్‌–4 ప్రమాణాలతో తొలి స్కూటర్‌ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తాం. అంతకుమించి వివరాలు చెప్పలేను. యాక్టివా, ఏవిఏటర్, నవీ బైకుల్ని కూడా మారుస్తున్నాం. దశలవారీగా మార్కెట్లోకి తెస్తాం. ఫిబ్రవరి ముగిసే నాటికి విపణిలో హోండా బైకులన్నీ బీఎస్‌–4వే ఉంటాయి. 2020 నాటికి బీఎస్‌–6 వాహనాలను తెస్తాం. దీనికోసం హర్యానాలోని మనేసర్‌లో ఆర్‌ అండ్‌ డీ జరుగుతోంది. అయితే బీఎస్‌ ప్రమాణాలతో బైకుల ధరలు రూ.500–1,000 వరకూ పెరుగుతాయి.

కొత్త ప్లాంట్లు గానీ, విస్తరణ గానీ ఏమైనా ఉందా?
ప్రస్తుతం మాకిక్కడ 4 ప్లాంట్లున్నాయి. మనేసర్‌(హర్యానా) సామర్థ్యం ఏటా 16 లక్షలు. తపుకరా (రాజస్థాన్‌) 12 లక్షలు. నర్సాపూర్‌ (కర్ణాటక) 12 లక్షలు కాగా విఠల్‌పూర్‌ (గుజరాత్‌) ప్లాంట్‌ 12 లక్షలు. జులైలో నర్సాపూర్‌ ప్లాంట్‌లో 4వ లైన్‌ను ప్రారంభిస్తాం. దీంతో మొత్తం సామర్థ్యం 64 లక్షలకు చేరుతుంది. ఇవన్నీ నూరుశాతం వినియోగించుకున్నాకే కొత్త ప్లాంట్‌ ఏర్పాటు యోచన చేస్తాం. ప్రస్తుతం దేశంలో 4,500 డీలర్‌షిప్స్‌ ఉండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 5,300కు చేరుస్తాం.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం టూవీలర్‌ పరిశ్రమపై ఎక్కువగానే ఉన్నట్లుంది?
2016–17లో ద్విచక్ర వాహనాల పరిశ్రమ 6 శాతం వృద్ధి సాధిస్తే హోండా మాత్రమే 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగిన నవంబర్లో మాత్రం అమ్మకాలు గ్రామాల్లో 60 శాతం, పట్టనాల్లో 50 శాతానికి పడిపోయాయి. ఇపుడు పట్టణ మార్కెట్‌ సాధారణ స్థితికి చేరుకుంది. గ్రామాల్లో ఈ పరిస్థితి రావాలంటే మరో రెండు నెలలు పడుతుంది. గతంలో మా మొత్తం నెట్‌వర్క్‌లో 6–7 శాతమే కార్డులను వాడేవారు. ఇపుడది 25 శాతానికి పెరిగింది. నగదు లావాదేవీల్ని ప్రోత్సహించడానికి మేం డౌన్‌ పేమెంట్‌ను తగ్గించాం.

ఎగుమతులు కూడా పెరుగుతున్నట్లున్నాయి? మీ బైకుల్లో ‘షైన్‌’ బాగా షైన్‌ అయినట్లుంది...!
నిజమే! మా పోర్టుఫోలియోలో షైన్‌ది ప్రత్యేక స్థానం. 2006లో మార్కెట్లోకి తెచ్చాక ఇప్పటిదాకా 50 లక్షల షైన్‌ బైకులు విక్రయించాం. 125 సీసీ బైకుల విక్రయాల్లో 36 శాతం వాటా దీనిదే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం షైన్‌ అమ్మకాల్ని 64 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. 2016 జనవరిలో 3,61,721 బైకులను విక్రయించిన హోండా.. ఈ ఏడాది జనవరిలో 3,68,145 బైకులను విక్రయించింది. అంటే 2% వృద్ధి నమోదయిందన్న మాట.

బీఎస్‌–4 సీబీ షైన్‌ ప్రత్యేకతలు..
125సీసీ ఆటోమెటిక్‌ హెడ్‌లైట్‌ (ఏహెచ్‌ఓ) బీఎస్‌–4 సీబీ షైన్‌ ధర డ్రమ్‌ బ్రేక్‌ వర్షన్‌ రూ.60,675, డిస్క్‌ బ్రేక్‌ వర్షన్‌ రూ.63,000 (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ)
సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్, హోండా ఎకో టెక్నాలజీ (హె చ్‌ఈటీ), 10.16 హెచ్‌పీ పవర్, 7,500 ఆర్‌పీఎం, టర్యూ 10.30 ఎన్‌ఎం. నీలం, ఎరుపు రంగులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement