
భారత్‌లో ఐఫోన్స్ తయారీకి యాపిల్ రెడీ
అమెరికా, చైనాలో ఐఫోన్‌ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది.
న్యూఢిల్లీ: అమెరికా, చైనాలో ఐఫోన్‌ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వ్యయాలు తగ్గించుకునే దిశగా ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ల తయారీపై ఆసక్తి వ్యక్తం చేసిన యాపిల్.. తాజాగా ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకుంది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేశ్ అభిషేక్ సారథ్యంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందంతో భేటీ అయిన కంపెనీ వర్గాలు ఈ విషయాలు వివరించాయి.
యాపిల్ ఐఫోన్ విభాగం గ్లోబల్ వైస్–ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రమణ్యన్ తదితర కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దిగుమతి చేసుకునే పరికరాలపై 15 సంవత్సరాల పాటు కస్టమ్స్ సుంకాల నుంచి, అలాగే కచ్చితంగా 30 శాతం పరికరాలు స్థానికంగా కొనుగోలు చేయాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని కంపెనీ కోరుతున్నట్లు సమాచారం.