రెండు సంస్థలుగా టెక్ దిగ్గజం హెచ్‌పీ
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం హ్యూలెట్ ప్యాకార్డ్(హెచ్‌పీ) రెండు సంస్థలుగా విడిపోనుంది. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ బిజినెస్‌లతోకూడిన యూనిట్ ఒక సంస్థగానూ, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్ సర్వీసుల బిజినెస్‌లు మరో కంపెనీగానూ ఏర్పాటుకానున్నాయి. ఫార్చూన్ 50లో భాగంకానున్న ఈ రెండు సంస్థలూ విడిగా లిస్టింగ్‌కానున్నాయి. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ విభాగాల యూనిట్‌కు ప్రస్తుత హెచ్‌పీ పేరు(లోగో)తో కొనసాగనుంది. ఎంటర్‌ప్రైజ్, సాఫ్ట్‌వేర్ సర్వీసుల విభాగాన్ని హ్యూలెట్ ప్యాకార్డ్ ఎంటర్‌ప్రైజ్ పేరుతో నిర్వహించనుంది.
ఈ వివరాలను కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2015 చివరికల్లా పూర్తికానున్న విభజనలో భాగంగా వాటాదారులకు రెండు కంపెనీల షేర్లనూ కేటాయించనున్నారు. కాగా, ఐదేళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా గతంలో 45,000 ఉద్యోగాల కోతను కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ విభజన నేపథ్యంలో మరో 10,000 వరకూ అదనపు ఉద్యోగాల కోతకు తెరలే వనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. వెరసి మొత్తం 55,000 మంది వరకూ ఉద్యోగాలను కోల్పోయే అవకాశమున్నట్లు కంపెనీ భావిస్తోంది.