హడ్కో ఐపీఓకు సెబీ ఆమోదం
ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 % డిస్కౌంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ చర్యల్లో భాగంగా ఐపీఓ ద్వారా హడ్కో నిధులు సమీకరించనుంది. 10 శాతం వాటాకు సమానమైన 20.01 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గత ఏడాది మార్చి నాటికి హడ్కో పెయిడప్ క్యాపిటల్ రూ.2,0001.9 కోట్లు. ఈ కంపెనీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది.
ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్... సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ఖాతాలోకి వెళతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా మైనారిటీ వాటా విక్రయం ద్వారా రూ.36,000 కోట్లు, వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.20,500 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ఈ జనవరిలో ఐపీఓ పత్రాలను సెబీకి హడ్కో సమర్పించింది.