హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ క్రయవిక్రయాలు టాప్ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జూలై – డిసెంబర్ (హెచ్2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 89 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.
ఏడాది మొత్తంగా చూస్తే 1.28 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన 12వ నివేదికలో తెలియజేసింది. ఇతర నగరాల్లో లావాదేవీలు చూస్తే.. ముంబైలో 51 లక్షల చ.అ., ఎన్‌సీఆర్‌లో 48 లక్షలు, పుణేలో 24 లక్షలు, అహ్మదాబాద్‌లో 10 లక్షలు, చెన్నైలో 34 లక్షలు, కోల్‌కతాలో 7 లక్షల చ.అ. మేర నమోదయ్యాయి. మంగళవారమిక్కడ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ నైట్‌ఫ్రాంక్ ఇండియా రియల్ ఎస్టేట్ రెండో అర్ధ సంవత్సర నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు.
జూలై – డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 8,065 గృహాలు ప్రారంభం కాగా.. 7,933 గృహాలు విక్రయమయ్యాయి. హెచ్1లో ప్రారంభాలు 5,430 కాగా.. అమ్మకాలు 8,334లుగా ఉన్నాయి. కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఆరంభమయ్యాయి. రూ.80– కోటి రూపాయల ధర ఉండే ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కోటిన్నర పైన ధర ఉండే గృహాల్లో 17 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాలు (ఇన్వెంటరీ) 39 శాతం క్షీణించి 4,397 యూనిట్లుగా ఉన్నాయి.
13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్..
హైదరాబాద్ కార్యాలయ స్థలాల లావాదేవీల్లో ఐటీ రంగానిదే హవా. 2018 హెచ్2లో మొత్తం లావాదేవీల్లో ఐటీ స్పేస్ వాటా 44 శాతంగా ఉండగా.. 2019 హెచ్2 నాటికి 58 శాతానికి పెరిగింది. గతేడాది హెచ్2లో నగరంలో 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ ధరలు చ.అ.కు రూ.61గా ఉండగా... ఏడాదిలో 5 శాతం వృద్ధి కనిపించింది.
దేశవ్యాప్తంగా..: దేశవ్యాప్తంగా హెచ్2లో 1,12,150 గృహాలు ప్రారంభం కాగా.. 1,16,576 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇన్వెంటరీ 5% క్షీణించి 4,45,836 యూనిట్లకు పరిమితమయింది. ఆఫీస్ స్పేస్‌లో 3.32 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి.
బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!
Published Wed, Jan 8 2020 1:59 AM | Last Updated on Wed, Jan 8 2020 1:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment