మార్చికల్లా ఐ20 ఎలైట్ క్రాస్‌ఓవర్ కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్చికల్లా ఐ20 ఎలైట్ క్రాస్‌ఓవర్ కారును మార్కెట్లోకి తేనుంది. ధర రూ.7-10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో రెండు వేరియంట్లు రానున్నాయి. 2015 మూడో త్రైమాసికంలో కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ కోఆర్డినేటర్ యంగ్ జిన్ ఆన్ వెల్లడించారు.
సికింద్రాబాద్ మెట్టుగూడలో సాబూ హ్యుందాయ్ షోరూంను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆర్‌ఎస్‌ఎం తేజ అడుసుమల్లి చౌదరితో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు ఆయన వెల్లడించనప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఐఎక్స్25 మోడల్‌కు స్వల్ప మార్పులు చేసి ఇక్కడికి తెచ్చే అవకాశం ఉంది.
8-9 శాతం వృద్ధి..: హ్యుందాయ్ మార్కెట్ వాటా భారత్‌లో 16.45 శాతం ఉంది. అన్ని మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన ఉందని, కొత్త మోడళ్లు రానుండడంతో 2015లో కంపెనీ మార్కెట్ వాటా 17 శాతం దాటుతుందని యంగ్ జిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్లాంటు వినియోగం 99.8 శాతం ఉంది. హ్యుందాయ్ మాత్రమే ఈ స్థాయిలో తయారీ చేపడుతోంది. విస్తరణకు సమయం ఆసన్నమైంది. దేశీయంగా అమ్మకాలు 4 లక్షల యూనిట్లకు చేరువలో ఉన్నాం. డిసెంబరుకల్లా 4.20 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు’ అని వెల్లడించారు.
షోరూం ద్వారా నెలకు 200 వాహనాలను విక్రయిస్తామన్న అంచనాలు ఉన్నాయని సాబూ హ్యుందాయ్ డెరైక్టర్ ప్రశాంత్ సాబూ తెలిపారు. హెచ్ ప్రామిస్ పేరుతో నాచారంలో పాత వాహనాల విక్రయ షోరూంను ప్రారంభించామని చెప్పారు.