నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కలర్ కోడ్ | I honestly pay the tax to the color code | Sakshi
Sakshi News home page

నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కలర్ కోడ్

Published Sat, Sep 6 2014 12:59 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

I honestly pay the tax to the color code

సాక్షి, విజయవాడ: ఆదాయపు పన్నును నిజాయితీగా చెల్లించేవారికి కలర్ కోడ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ కేవీ చౌదరి తెలిపారు. గతంలో నిజాయితీగా పన్ను చెల్లించే వారికి సన్మానం చేసే వారని, కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో నిలిపివేశారని, ఆ స్థానంలో కోడ్ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఎస్‌ఐఆర్‌సీ ఆఫ్ ఐసీఏఐ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యక్ష పన్నులపై నగరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీ చౌదరి మాట్లాడుతూ.. ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలుకు సంబంధించి మంచి స్పందన వస్తోందన్నారు. దానివల్ల తప్పులు రాకుండా వుంటున్నాయన్నారు. ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారందరూ విధిగా ఇ-ఫైలింగ్‌లో రిటర్న్స్ దాఖలు చేయాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని ఆయకర్ సేవా కేంద్రాలు  ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడల్లో త్వరలో వీటిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను మదింపుదారులు (చార్టెర్డ్ అకౌంటెంట్లు) నైతిక ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రమాణాలు పాటించకుండా మదింపు చేపడితే ఆ సంస్థకు, పన్ను చెల్లింపుదారునికీ చెడ్డపేరు వస్తుందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భూ అగ్రిమెంట్లు పెరగనున్నాయని, అయితే రైతుపై పన్నుభారం పడకుండా చూడాలన్నారు. చేపల రైతులు తమ ఆదాయానికి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించలేరని, వారికి వచ్చే ఆదాయ మార్గాలను అనుసరించి పన్ను విధించాలన్నారు.

మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సులు అందించే కాలేజీలకు జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు వెళ్లి ఆదాయపు పన్ను చెల్లింపుపై విద్యార్థి దశలోనే అవగాహన కలిగించాలని కేవీ చౌదరి కోరారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ (ఏపీ, తెలంగాణ) సురేష్‌బాబు, ఆంధ్ర చాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, ఎస్‌ఐఆర్‌సీ ఆఫ్ ఐసీఏఐ నగరశాఖ చైర్మన్  ఎస్ అక్కయ్యనాయుడు, సభ్యుడు ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement