KV Chaudhary
-
కేవైసీ వ్యవస్థ మరింత పటిష్టం కావాలి...
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖాతాదారుల వివరాల వెల్లడికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న కేవైసీ నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అభిప్రాయపడ్డారు. కేవైసీ ఫారంల రూపంలో వచ్చే ఖాతాదారుల వివరాల వాస్తవికతను ధృవీకరించుకునేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ఖాతాదారులు ఇచ్చిన డాక్యుమెంట్లను బ్యాంకులు ప్రస్తుతం ఆన్లైన్ మాధ్యమంలో ధృవీకరించుకునే వెసులుబాటు లేనందున పాన్ కార్డులు.. డ్రైవింగ్ లెసైన్సులు వంటి పత్రాల మార్ఫింగ్ తదితర మోసాలకు అవకాశాలు ఉన్నాయని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ డేటాబేస్లను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి మోసాలను అరికట్టడం సాధ్యపడుతుందని శుక్రవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. -
క్రమశిక్షణతో ముందడుగు
సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మచిలీపట్నం: విద్యార్థి దశలో క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుందని సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ కేవీ చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో వారిద్దరినీ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామిద్దరం హిం దూ కళాశాలలోనే చదువుకున్నామన్నారు. అప్ప ట్లో పాఠ్యాంశాలు బోధించిన రామచంద్రశాస్త్రి, వైజేఎల్ లక్ష్మణస్వామి, ఎం.హనుమంతరావు తదితర ఉపాధ్యాయుల ప్రభావం తమపై ఎంతగానో పడిందన్నారు. హిందూ హైస్కూల్, కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకు లు తమకు విద్యతో పాటు మంచి నడవడికను నేర్పారన్నారు. విద్యార్థులు కష్టపడేతత్వంతో పాటు క్రమశిక్షణ అలవరుచుకుని ముందడుగు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్, హిందూ అనుబంధ సంస్థల కార్యదర్శి దైతా రామచంద్రశాస్త్రి, కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేవీ చౌదరి దంపతులను పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
నిజాయితీగా పన్ను చెల్లించే వారికి కలర్ కోడ్
సాక్షి, విజయవాడ: ఆదాయపు పన్నును నిజాయితీగా చెల్లించేవారికి కలర్ కోడ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ కేవీ చౌదరి తెలిపారు. గతంలో నిజాయితీగా పన్ను చెల్లించే వారికి సన్మానం చేసే వారని, కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో నిలిపివేశారని, ఆ స్థానంలో కోడ్ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఎస్‌ఐఆర్‌సీ ఆఫ్ ఐసీఏఐ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యక్ష పన్నులపై నగరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీ చౌదరి మాట్లాడుతూ.. ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలుకు సంబంధించి మంచి స్పందన వస్తోందన్నారు. దానివల్ల తప్పులు రాకుండా వుంటున్నాయన్నారు. ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారందరూ విధిగా ఇ-ఫైలింగ్‌లో రిటర్న్స్ దాఖలు చేయాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని ఆయకర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడల్లో త్వరలో వీటిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను మదింపుదారులు (చార్టెర్డ్ అకౌంటెంట్లు) నైతిక ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రమాణాలు పాటించకుండా మదింపు చేపడితే ఆ సంస్థకు, పన్ను చెల్లింపుదారునికీ చెడ్డపేరు వస్తుందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భూ అగ్రిమెంట్లు పెరగనున్నాయని, అయితే రైతుపై పన్నుభారం పడకుండా చూడాలన్నారు. చేపల రైతులు తమ ఆదాయానికి సంబంధించి సరైన రికార్డులు నిర్వహించలేరని, వారికి వచ్చే ఆదాయ మార్గాలను అనుసరించి పన్ను విధించాలన్నారు. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సులు అందించే కాలేజీలకు జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులు వెళ్లి ఆదాయపు పన్ను చెల్లింపుపై విద్యార్థి దశలోనే అవగాహన కలిగించాలని కేవీ చౌదరి కోరారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ (ఏపీ, తెలంగాణ) సురేష్‌బాబు, ఆంధ్ర చాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, ఎస్‌ఐఆర్‌సీ ఆఫ్ ఐసీఏఐ నగరశాఖ చైర్మన్ ఎస్ అక్కయ్యనాయుడు, సభ్యుడు ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు.