
కరోనా కలకలంతో వాట్సాప్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ సేవలు
ముంబై : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం వాట్సాప్‌లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన క్రమంలో కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఇంటి నుంచే పొందేందుకు నూతన సర్వీసును ప్రారంభించామని బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ కస్టమర్లు వాట్సాప్ ద్వారా తమ పొదుపు ఖాతాలో నిల్వను, చివరి మూడు లావాదేవీల వివరాలను, క్రెడిట్ కార్డు పరిమితిని చెక్ చేసుకోవచ్చని వెల్లడించింది. వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కస్టమర్లు వివిధ ఆపర్ల వివరాలు పొందవచ్చని, క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకాన్ని బ్లాక్, అన్‌బ్లాక్ చేసుకోవచ్చని తెలిపింది. బ్రాంచ్‌ను సందర్శించకుండానే తమ కస్టమర్లు బ్యాంకింగ్ అవసరాలను నెరవేర్చుకోవచ్చని, తమ కస్టమర్లకు ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి అన్నారు.