సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ ప్రతి మనిషి జీవితంపైనా ప్రభావం చూపుతోంది. చివరకు వాట్సాప్ స్టేటస్‌లు, గ్రూపుల్లోని వివరాలు సైతం కొత్త పంథాలోకి మారిపోయాయి. వీటిలో ఎక్కడ చూసినా కరోనా సమాచారం, దానికి సంబంధించిన అవసరాలు..అంశాలే కనిపిస్తున్నాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెల్ఫీ కల్చర్ పెరిగాకా...దాదాపు 60 శాతం మంది స్టేటస్‌లు వీటితోనే నిండిపోతున్నాయి. ఒకసారి పెట్టిన స్టేటస్ 24 గంటలు మాత్రమే ఉంటుంది.
ఈ నేపథ్యంలో అనేక మంది ప్రతి రోజూ ఓ సెల్ఫీ తీసుకునో, ఫోన్‌లో ఉన్న ఫొటోల్లో ఉత్తమమైనది ఎంచుకునో సెల్ఫీలుగా పెట్టేవాళ్లు. మిగిలిన వారిలో కొందరు సందేశాలు, హితోక్తులు, సామెతలతో నింపేసేవాళ్లు. మరికొందరైతే వీడియోలు, జోకులు పండించేవాళ్లు. ఇప్పుడు దాదాపు 90 శాతం మంది స్టేటస్‌లు కోవిడ్ సమాచారంతో నిండిపోతున్నాయి. ‘పాజిటివ్ వచ్చింది..నన్ను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోండి’, ‘ఫలానా రోగికి చికిత్స కోసం అత్యవసరంగా ఫలానా గ్రూపు ప్లాస్మా కావాలి’, ‘ఆ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో ఓ బెడ్ కావాలి’, ‘ రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అర్జంట్‌గా అవసరం’ ఇవే కనిపిస్తున్నాయి.
అతి తక్కువ మంది మాత్రం వ్యాక్సిన్, కర్ఫ్యూ వివరాలు స్టేటస్‌లుగా పొందుపరుస్తున్నారు. అప్‌లోడ్ అవుతున్న వీడియోల్లోనూ విషాదాలవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆక్సిజన్ అందక జరిగిన దారుణాలు, కాలుతున్న చితిమంటలు...ఇలాంటివే కనిపిస్తున్నాయి. కేవలం స్టేటస్‌లే కాదు..అనేక గ్రూపుల్లోనూ ఇదే సమాచారం ఉంటోంది. సందట్లో సడేమియా అన్నట్లు పుకార్లు పుట్టించి వాటిని వైరల్ చేసే వాళ్లూ రెచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా కొవిడ్ సహాయం, ప్లాస్మా వివరాల కోసం కొత్తగా గ్రూపులు సైతం పుట్టుకు వచ్చాయి.
చదవండి: తెలంగాణకు టీకా అరకొరే.. ఆ ఆస్పత్రులకు టీకా బంద్
Comments
Please login to add a commentAdd a comment