
ముంబై : వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల జారీ కేసులో సీఈవో చందాకొచర్‌కు సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ వివాదంపై బ్యాంక్ బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించడంతో, చందాకొచర్ సెలవుపై ఇంటికి వెళ్లారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలోనే బ్యాంక్, కొత్త ఛైర్మన్ ఎంపికను కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుత ఛైర్మన్ ఎం.కె.శర్మ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుండటంతో, ఆయన స్థానంలో కొత్త వారిని బ్యాంక్ నియమించబోతుంది. బ్యాంక్‌కు కొత్త ఛైర్మన్‌గా ఎం.డి మాల్యా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు బోర్డు జూన్ మొదటి వారంలోనే తదుపరి ఛైర్మన్‌గా మాల్యా పేరును ఎంపిక చేసి ఆర్‌బీఐ అనుమతుల కోసం పంపినట్లు సమాచారం. మాల్యా అంతకముందు బ్యాంక్ ఆఫ్ బరోడా ఛైర్మన్‌గా పనిచేశారు. మే29న ఆయన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
బోర్డుతో చర్చించిన అనంతరం ఈ ప్రతిపాదనను ఆర్‌బీఐకు పంపించినట్టు ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో మెజార్టీ సభ్యులు మాల్యాకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. కానీ, ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుతోనే ఆర్‌బీఐ కూడా ఏకీభవిస్తుందని తెలిసింది. అయితే ఈ విషయంపై ఆర్‌బీఐ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియరాలేదు. ఇప్పటికే బ్యాంకు సీఈవో చందాకొచర్ సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను కొత్త సీవోవో సందీప్ బక్షికి అప్పగించారు. ఐసీఐసీఐ బ్యాంక్ త్వరలోనే కొత్త ఛైర్మన్‌ను నియమిస్తుందని తెలియగానే బ్యాంక్ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా పైకి ఎగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment