
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.289 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.214 కోట్లు నికర లాభం సాధించామని, దీంతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్ వసూళ్లు రూ.3,394 కోట్ల నుంచి 14 శాతం వృద్దితో రూ.3,856 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌గా చెల్లించడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. గత క్యూ1లో 22.4 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ యావరేజ్ ఈక్విటీ(ఆర్‌ఓఏఈ) ఈ క్యూ1లో 24.7 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలతాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్ 3.5 శాతం లాభంతో రూ.736 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment