ఐడీబీఐ బ్యాంకులో వాటాలకు సీడీసీ ఆసక్తి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఇంగ్లాండ్‌కి చెందిన సీడీసీ, సింగపూర్‌కి చెందిన జీఐసీ తదితర సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. 15 శాతం వాటాల కొనుగోలు కోసం ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది. ఐడీబీఐ బ్యాంకు ఎండీ కిశోర్ ఖరాత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 80 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా వీటిని 50 శాతానికన్నా తక్కువకి తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సంగతి తెలిసిందే.
మరోవైపు, వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించుకునే దిశగా ఐడీబీఐ బ్యాంకు మూడేళ్ల ప్రణాళికను రూపొందించింది. దీని కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనుంది. మూడేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రెట్టింపు చేసుకోవాలని, ప్రస్తుతమున్న రూ. 5 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఖరాత్ తెలిపారు. మరోవైపు మార్కెట్లో పరిస్థితులు సరిగ్గా లేనందున సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ. 3,771 కోట్ల విలువ చేసే షేర్ల విక్రయ యోచనను ఐడీబీఐ బ్యాంకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. మంగళవారం బ్యాంకు షేరు 1.8 శాతం పెరిగి రూ. 59.50వద్ద ముగిసింది.