కేంద్రం కొన్ని ప్రభుత్వసంస్థల నుంచి చాలా కాలంగా పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. వ్యూహాత్మక విక్రయాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని పలుమార్లు చెప్పింది. తాజాగా ప్రముఖ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు సన్నద్ధం జరుగుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో ఐడీబీఐ బ్యాంక్‌లోని తమ వాటాను ఉపసంహరించుకుంటామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)కు 49.24 శాతం వాటా ఉంది.
ఈ రెండు వాటాల్లో కలిపి మొత్తంగా దాదాపు 61 శాతం అమ్మేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 2022 అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించగా, 2023 జనవరిలో కొంటామని కొందరు ఆసక్తికనబరిచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉంది.
ఇదీ చదవండి: పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఐడీబీఐ బ్యాంకులో వాటా కొనుగోలు చేయాలనుకునే బిడ్డర్లకు కనీసం రూ.22,500 కోట్ల కనీస నికర సంపద, గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లలో నికర లాభాలు ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఒకవేళ బిడ్డర్లు కన్సార్టియంగా ఏర్పడితే.. గరిష్ఠంగా నలుగురు మాత్రమే ఉండాలని ‘దీపం’ షరతు విధించింది. డీల్ కుదిరితే బిడ్డర్లు కనీసం 40 శాతం వాటాలను ఐదేళ్ల వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment