కేంద్రం మెడకు '2జీ'! | If there was no 2G scam, why did the Supreme Court cancel 122 spectrum licences in 2012? | Sakshi
Sakshi News home page

కేంద్రం మెడకు '2జీ'!

Published Sat, Dec 23 2017 1:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

If there was no 2G scam, why did the Supreme Court cancel 122 spectrum licences in 2012? - Sakshi

న్యూఢిల్లీ: తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌ కేసు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడేటట్లు కనిపిస్తోంది. 2జీ కుంభకోణం కేసు అంతా ఊహాజనితమేనని, అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేనందున అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునివ్వటం తెలిసిందే. దీంతో 2జీ కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వారితోపాటు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం లైసెన్స్‌లు కోల్పోయిన కంపెనీలు పరిహారం కోరుతూ న్యాయబాట పట్టే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు అంటున్నారు. టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు (టీడీ శాట్‌) లేదా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

లూప్‌ టెలికం...
2జీ కేసులో వాదించిన న్యాయనిపుణుల అభిప్రాయాల ప్రకారం... లూప్‌ టెలికం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్‌ కోసం చెల్లించిన రూ.1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్‌ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్‌ ఫీజు రూ.1,658 కోట్లుగా ఉంది. ఈ ఫీజుతోపాటు లైసెన్స్‌ రద్దు చేసిన దరిమిలా తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ.1,000 కోట్లు కూడా ఇప్పించాలని లూప్‌ టెలికం డిమాండ్‌ చేసింది. ఈ వాదనను టీడీ శాట్‌ కొట్టేసింది. ‘మీపై నేరపూరిత విచారణ’ పెండింగ్‌లో ఉందని టీyీ  శాట్‌ నాడు పేర్కొంది. నిర్ధోషులు అంటూ ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పరిహారం కోసం డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయి.

టెలినార్, ఎతిసలాట్‌ కూడా...
విదేశీ టెలికం సంస్థలైన టెలినార్, ఎతిసలాట్, లూప్‌ టెలికంలో ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ సంస్థలు (ఇందులో కొన్ని గతంలో ఆర్బిట్రేషన్‌కు ప్రయత్నించాయి) కూడా పరిహారం కోరే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడికలకు లోబడి ఆర్బిట్రేషన్‌ మార్గాన్ని చాలా వరకు విదేశీ కంపెనీలు ఎంచుకునే అవకాశాలున్నాయని ఓ న్యాయవాది అభిప్రాయం తెలిపారు.

టెలికం కార్యకలాపాల కోసం చేసిన పెట్టుబడులు, గడువు ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించలేకపోయినందున ప్రభుత్వానికి చెల్లించిన పెనాల్టీలతోపాటు పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భారత్‌లో టెలికం వ్యాపారంపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన టెలినార్‌ కూడా గతంలో కేంద్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది. 1.4 బిలియన్‌ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని సింగపూర్‌తో మన దేశం చేసుకున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కింద కోరింది.

రద్దయిన స్పెక్ట్రమ్‌ కోసం చేసిన చెల్లింపులను తిరిగి వెనక్కిచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో నోటీసును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత టెలినార్‌ పలు సర్కిళ్లలో మళ్లీ లైసెన్స్‌లు దక్కించుకుంది. చివరికి తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు అమ్మేసి వెళ్లిపోయిన టెలినార్‌ భారత్‌లో వ్యాపారం కారణంగా రూ.10,000 కోట్లను నష్టం కింద రద్దు చేసుకుంది. అలాగే, లూప్‌ టెలికంలో పెట్టుబడులు పెట్టిన ఖైతాన్‌ హోల్డింగ్స్‌ అయితే, 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిన కారణంగా తమకు 2.5 బిలియన్‌ డాలర్లను నష్ట పరిహారం కింద చెల్లించాలని కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది.

తుది తీర్పు అనంతరమే...
‘‘పరిహారం కోసం కేసుల నమోదుకు ఈ తీర్పు వీలు కల్పిస్తుంది. కాకపోతే, అదంతా తుది తీర్పు తర్వాతే వీలవుతుంది. ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. కనుక కంపెనీలు దేశంలో వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించొచ్చు’’ అని ఓ టెలికం కంపెనీకి చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు.


సుప్రీం తీర్పునకు భిన్నంగా...
ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అయితే, తాజాగా సీబీఐ కోర్టు తీర్పు, సుప్రీం తీర్పులోని అంశాలను ప్రతిఫలించడం లేదని మరి కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన లైసెన్స్‌ల కేటాయింపు అన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ఉల్లంఘన అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిష్పక్షపాతంగా ఉందని అద్వైతా లీగల్‌ సంస్థ పార్ట్‌నర్‌ అతుల్‌దువా అన్నారు. ప్రజలకు ధర్మకర్త అయిన ప్రభుత్వం సహజన వనరులను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదిక పేరుతో అసమంజసంగా పంపిణీ చేసిందని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement