తొలి రోజు ఐఐటీ ప్లేస్‌మెంట్స్ మంచి ఊపుతో ప్రారంభమయ్యాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆఫ్‌షోర్ పొజిషన్లలో భాగంగా వార్షిక వేతనంగా రూ.1.39 కోట్ల వేతన ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఐఐటీ విద్యార్థులకు ఆఫర్ చేసింది. ఐఐటీ రూర్కే, బొంబై, మద్రాస్, గౌహతి క్యాంపస్ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ఈ ఆఫర్ ప్రకటించింది. రూర్కే నుంచి ముగ్గుర్ని, గౌహతికి రెండు ఆఫ్‌షోర్ ఆఫర్లు, ఎనిమిది మందికి దేశీయ ఆఫర్లను అందించింది. మరో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఈ ఏడాది దేశీయ పొజిషన్ల కోసం ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తొలిసారి ఈ కంపెనీ భారత్‌కు ప్లేస్‌మెంట్లకు వచ్చింది. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ల సమాచారం మేరకు ఈ టెక్నాలజీ దిగ్గజం ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది.
మద్రాసు, గౌహతి క్యాంపస్‌లలో ఇది ప్లేస్‌మెంట్లను చేపట్టిందని వెల్లడైంది. వాల్‌స్ట్రీట్ సూచీ నాస్‌డాక్ కూడా తొలిసారి మద్రాసు క్యాంపస్‌లో నియామకాలను చేపట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆఫర్లు, వేతన ప్యాకేజీలు స్వల్పంగా పెరిగినట్టు ప్లేస్‌మెంట్ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకింగ్ సంస్థ బ్లాక్‌స్టోన్ దేశీయ పొజిషన్ల కోసం అత్యధిక మొత్తంలో రూ.35 లక్షల వరకు ప్యాకేజీని ఆఫర్ చేసింది. దేశీయ పొజిషన్లకు అత్యధిక ప్యాకేజీలు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకున్నాయి. డే1లోనే పెద్ద మొత్తంలో ఆఫర్ల వెల్లువ కొనసాగిందని, వచ్చే సెషన్స్‌లో కూడా ఇదే రకమైన స్పందన ఉంటుందని ఆశిస్తున్నామని ఐఐటీ మద్రాసు ప్లేస్‌మెంట్ డ్రైనింగ్, అడ్వయిజరీ మను శాంతనమ్ తెలిపారు. తొలి స్లాటు ముగిసే లోపు 99 విద్యార్థులు ప్లేస్ అయినట్టు పేర్కొన్నారు. గతేడాది ఈ సంఖ్య 77గానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment