ఓలాలో చైనా డీడీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల కంపెనీ ఓలాలో చైనా సంస్థ డీడీ కువైడీ ఇన్వెస్ట్ చేసింది. అయితే, ఎంత పెట్టుబడి పెట్టినదీ వివరాలు వెల్లడి కాలేదు. ప్రత్యర్థి సంస్థ ఉబెర్‌తో పోటీపడేందుకు ఓలా 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,320 కోట్లు) సమీకరించడానికి ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజా పెట్టుబడులు.. ఓలా చిన్న పట్టణాల్లో కార్యకలాపాలు విస్తరించేందుకు తోడ్పడనున్నాయి. మరోవైపు, యాప్ ద్వారా ట్యాక్సీ సేవలు అందించే డీడీ డాషే, కువైడీ డాషే కంపెనీల విలీనంతో డీడీ కువైడీ ఏర్పడింది. ఇది చైనా సహా హాంకాంగ్‌లో రెండు బ్రాండ్ల పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఆలీబాబా గ్రూప్, టెన్సెంట్ వంటి చైనా టెక్ దిగ్గజాల పెట్టుబడులు ఉన్నాయి.