సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్
డబ్ల్యూఈఎఫ్ నివేదిక
జెనీవా: అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి అంశాల్లో భారత్ దాదాపు అట్టడుగు స్థానంలో ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో పేర్కొంది. అయితే, వ్యాపారం.. రాజకీయాల్లో నైతికత విషయంలో మాత్రం అంతర్జాతీయంగా మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు వివరించింది. 112 ఎకానమీలపై దాదాపు రెండేళ్ల పాటు అధ్యయనం అనంతరం విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధి నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ అంశాలు పేర్కొంది.
ఇందులో ర్యాంకింగ్స్ ప్రకారం .. మధ్యస్థాయి ఆదాయాల దేశాల జాబితాలోని 38 దేశాల్లో భారత్ దాదాపు చివరి స్థానాల్లో ఉంది. ఆర్థిక ప్రయోజనాల బదలాయింపు అంశంలో 37వ స్థానంలో ట్యాక్స్ కోడ్ అమల్లో 32వ స్థానంలో, సామాజిక భద్రత విషయంలో 36వ స్థానంలో ఉంది. ఇక చిన్న వ్యాపారాల యాజమాన్యం అంశంలో గ్రూప్‌లోని మిగతా అన్ని దేశాల కన్నా అట్టడుగున 38వ స్థానంలో నిల్చింది. అయితే, వ్యాపార, రాజకీయ నైతికత విషయంలో మెరుగ్గా 12వ స్థానంలోనూ, పెట్టుబడులు ఉత్పాదకతకు ఉపయోగపడుతున్నాయన్నది సూచిస్తూ ఆర్థిక మధ్యవర్తిత్వం అంశంలో 11వ స్థానంలో ఉంది. అసెట్ నిర్మాణం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంపై భారత్ దృష్టి సారించాల్సి ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.