తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరిగాయ్ | Income Tax Department Activates e-Filing For More Forms Of Returns | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరిగాయ్

Published Fri, Apr 8 2016 6:06 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరిగాయ్

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరిగాయ్

2015-16లో రూ.36,663 కోట్లు; వృద్ధి 15.4%
ఏపీ, తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బాబు వెల్లడి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంస్థల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్‌లు తగ్గినప్పటికీ ఏపీ, తెలంగాణల్లో నిర్దేశిత పన్ను వసూళ్ల లక్ష్యాలను అధిగమించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. 2015-16 సంవత్సరంలో రూ.36,251 కోట్లు వసూలవుతాయని లక్ష్యంగా పెట్టుకోగా... దానికన్నా అధికంగా రూ.36,663 కోట్లను వసూలు చేసినట్లు ఈ రెండు రాష్ట్రాల ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇండ్ల సురేశ్ బాబు తెలిపారు. ఈ మొత్తంలో కార్పొరేట్ ట్యాక్స్ వాటా రూ. 21,382 కోట్లు కాగా, ఆదాయ పన్ను మొదలైనవి రూ.15,281 కోట్లు.

అంతక్రితం సంవత్సరం రూ. 31,763 కోట్లతో పోలిస్తే వసూళ్లలో 15.4% వృద్ధి నమోదు చేశామని, ఇది దేశవ్యాప్త వృద్ధి రేటు 7.5% కన్నా అధికమని గురువారమిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. ఎన్‌ఎండీసీ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్ వంటి పెద్ద సంస్థల నుంచి రూ. 2,042 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు తగ్గినప్పటికీ... టీడీఎస్‌లు మొదలైన వాటి ఊతంతో నిర్దేశిత వసూళ్ల లక్ష్యాలను అధిగమించామని పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్ లక్ష్యాలు 14-15% అధికంగా ఉండొచ్చని సురేశ్ బాబు చెప్పారు.

 పెరిగిన చెల్లింపుదారులు..: కొత్తగా 4,83,398 మంది చెల్లింపుదారుల నుంచి పన్నులు వసూలయ్యాయని, దీంతో మొత్తం అసెసీల సంఖ్య 27 శాతం పెరిగి 23,23,802కి చేరిందని సురేశ్ బాబు చెప్పారు. అలాగే, ఆన్‌లైన్‌లో దాఖలయ్యే రిటర్నులూ సుమారు 32% వృద్ధితో 26,29,269కి చేరాయన్నారు. రిఫండ్లు కూడా 38.5 శాతంపెరిగాయి.

 రాష్ట్రాలవారీగా ...: తెలంగాణలో పన్ను వసూళ్లు రూ. 27,770 కోట్ల నుంచి 16.6 శాతం పెరిగి రూ. 32,331 కోట్లకు చేరగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,046 కోట్ల నుంచి 7 శాతం పెరిగి రూ.4,332 కోట్లకు చేరాయి. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో ఆర్‌ఐఎన్‌ఎల్ (వైజాగ్ స్టీల్), పోర్ట్ ట్రస్టుల నుంచి పన్నుల వసూళ్లేమీ లేకపోగా, రిఫండ్లు పెరిగినట్లు సురేశ్ బాబు తెలిపారు.  ‘‘అత్యధికంగా చెల్లింపులు జరిపిన వాటిల్లో ఎన్‌ఎండీసీ (రూ. 1,600 కోట్లు), సింగరేణి కాలరీస్ (రూ. 833 కోట్లు), అరబిందో ఫార్మా (రూ. 469 కోట్లు) తదితర సంస్థలు ఉన్నాయి.

మాటీవీని స్టార్ టీవీ కొనుగోలు చేసిన లావాదేవీకి సంబంధించి రూ.480 కోట్లు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద వచ్చాయి’’ అని ఆయన వివరించారు. వ్యక్తిగత  స్థాయిలో అత్యధిక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వారిలో పొగాకు ఉత్పత్తుల రంగంలో ఉన్న పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన పోలిశెట్టి శ్యామ్‌సుందర్, కేర్ ఆసుపత్రుల చైర్మన్, కార్డియాలజిస్టు భూపతిరాజు సోమరాజు ఉన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇక, 2016-17 దాకా వెల్లడించని ఆదాయాలను... ఒకేసారి వెల్లడించి ప్రాసిక్యూషన్ తప్పించుకునే వీలు కల్పిస్తూ బడ్జెట్‌లో కొత్తగా ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమును ప్రతిపాదించినట్లు సురేశ్ బాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement