పశ్చిమగోదావరి, నిడమర్రు: క్యాలెండర్ సంవత్సరం ముగిసి 20 రోజులు దాటింది. సుమారు మరో 70 రోజుల్లో అంటే 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోపు పన్ను ప్లానింగ్ జరిగిపోవాలి. ఆఖరు నిమిషంలో కంగారు పడకుండా ముందస్తుగా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవటం ద్వారా ఆదాయ పన్నుశాఖకు రిటర్న్ సమర్పించే విషయంలో అవగాహన ఉంటుంది. ఆఖరు నిమిషంలో చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్లు ఏమైనా ఉంటే ముందుగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పన్ను రాయితీల వినియోగంపై స్పష్టత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. టీడీఎస్ వర్తించే ఉద్యోగులు రాయితీ పొందేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ముందే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
సెక్షన్ 80 సీ కింద మినహాయింపుల కోసం
ఈ సెక్షన్ కింద పెట్టే పెట్టుబడులపై ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. హౌసింగ్ లోన్ మూలధనం చెల్లింపులు, బీమాతో సహా అనేక రకాల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు వర్తిస్తాయి. వాటికి సంబంధించిన ఆధారాలు జాగ్రత్త చేసుకోవాలి.
రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు
♦ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్), జీవిత బీమా పథకాలు, పీపీఎఫ్ సహా చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తే ఓకే.. లేదంటే ఇప్పటికైనా 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందడానికి అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మంచిది.
♦ ఎక్కువ మొత్తంలో టీడీఎస్ కట్ కాకుండా, ఈఎల్‌ఎస్‌ఎస్ అయితే ఫండ్ స్టేట్‌మెంట్, జీవిత బీమా పాలసీ అయితే ప్రీమియం చెల్లించిన రసీదులను ఆఫీసు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో సమర్పించాలి.
♦ పీపీఎప్ పెట్టుబడులకు సంబంధించి బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు సూచించే పాస్‌బుక్ జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే ఖాతా వివరాలు, లావాదేవీల వివరాలు తెలిపే ఇ–రసీదు సమర్పించాలి. ఇవేకాకుండా సుకన్య సమృద్ధి యోజన లేదా ఐదేళ్ల కాలపరిమితి ఉండే టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఇచ్చే డిపాజిట్ రసీదు లేదా సర్టిఫికెట్ కాపీ సమర్పించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోని పక్షంలో టీడీఎస్ ఎక్కువ కట్ అవుతుంది. మళ్లీ రిటరŠన్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
ట్యూషన్ ఫీజు..
మీ పిల్లలకు స్కూల్, కళాశాలల్లో చెల్లించే ట్యూషన్ ఫీజు కూడా 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ రాయితీ క్లెయిమ్ చేస్తుంటే ఫీజులకు సంబంధించిన రసీదులు జిరాక్స్ కాపీని అకౌంట్స్ సిబ్బందికి ఇవ్వాలి, ఈ రసీదుపై స్కూల్/కళాశాల అధికారి స్టాంప్, ఫీజు అందుకున్నవారి సంతకం తప్పకుండా ఉండాలి.
తొలిసారి ఇల్లుకొన్న వ్యక్తులు..
కొత్తగా ఇల్లు కొన్నవారికి ఈసారి ప్రత్యేక రాయితీ ఉంది. సాధారణంగా సెక్షన్ 24 కింద గృహరుణాలపై చెల్లించే వడ్డీ మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలు వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.
∙మొట్టమొదటిసారిగా ఇల్లు కొన్నవారికి అదనంగా మరో రూ.50 వేలు వరకు సెక్షన్ 80ఈఈ కింద ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంటే తొలిసారి ఇల్లు కొన్నవారికి వడ్డీ చెల్లింపులపై రూ.2.5 లక్షల వరకూ పన్ను రాయితీ ఉంది. బ్యాంక్ నుండి మూలధనం ఎంత చెల్లించారు. వడ్డీ ఎంత చెల్లించారు తెలిపే సర్టిఫికెట్ సమర్పించాలి.
హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు
♦ హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసేవారు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటి వార్షిక అద్దె రూ.లక్ష (నెలకు 8,333) దాటితే ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. ఇంకా నిర్ణీత ఫారంలో ఇంటి యజమాని సంతకంతో కూడిన లీజు అగ్రిమెంట్, ఇంటి యాజమాన్యానికి సంబంధించిన ఆధారాలు కాపీలు ఇవ్వాలి.
♦ ఇంటి యాజమాన్యానికి సంబంధించి పన్ను రసీదు లేదా తాజా విద్యుత్ బిల్లు సరిపోతుంది. ఇల్లు ఏదైనా కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే ఆ సొసైటీ ఇచ్చే షేర్ సర్టిఫికెట్ అయినా సరిపోతుంది. ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటివరకు అందుకున్న ఒరిజనల్ అద్దె రసీదులు కూడా సమర్పించాలి. గృహ రుణంతో కొన్న ఇంటిని అద్దెకిచ్చినా ఆ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీల వివరాలు విడివిడిగా పేర్కొంటూ బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్ జతచేయాలి.
ఎన్‌పీఎస్ పెట్టుబడులు..
మీరు పనిచేసే కంపెనీ, సంస్థ ద్వారా జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్)లో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలన్నీ మీ కంపెనీ దగ్గరే ఉంటాయి. కాబట్టి ఆ పెట్టుబడుల వివరాలు ప్రత్యేకంగా కంపెనీకి సమర్పించాల్సిన అవసరం లేదు. జీతం నుంచి కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం నుంచి ఎన్‌పీఎస్‌లో వ్యక్తిగత హోదాలో రూ.50 వేలు పెడితే మాత్రం ఆ వివరాలు ఆఫీసుకు సమర్పించాలి. ఇందుకోసం ఉద్యోగి పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్), టైర్ 1 ఖాతాకు సంబంధించిన ఎన్‌పీఎస్ లావాదేవీల స్టేట్‌మెంట్ వివరాలు ఇవ్వాలి.
మెడిక్లెయిమ్‌లు
మెడిక్లెయిమ్ పాలసీ కింద చెల్లించిన ప్రీమియం ప్రూఫ్‌లు కంపెనీకి ఇవ్వాలి. ఈ చెల్లింపులకు సెక్షన్ 80డీ కింద సీనియర్ సిటిజన్లకు రూ.30 వేల వరకు ఇతరులకు రూ.25 వేల వరకూ మినహాయింపు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment