నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు | Increased IT returns with cancellation of banknotes | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు

Published Wed, Dec 5 2018 12:54 AM | Last Updated on Wed, Dec 5 2018 12:54 AM

Increased IT returns with cancellation of banknotes - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్‌) దాఖలు చేసిన వారి సంఖ్య 6.08 కోట్లకు పెరిగిందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ సుశీల్‌ చంద్ర వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు గణనీయంగా తోడ్పడిందని ఆయన వెల్లడించారు. ‘పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరగడానికి డీమోనిటైజేషన్‌ గణనీయంగా తోడ్పడింది. ఈ ఏడాది ఇప్పటిదాకా (2018–19 అసెస్‌మెంట్‌ ఇయర్‌) 6.08 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం వృద్ధి. కాబట్టి ఇది డీమోనిటైజేషన్‌ ప్రభావమేనని చెప్పవచ్చు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఏ తేదీ నాటికి ఫైలింగ్స్‌ 6.08 కోట్లకు చేరాయన్నది మాత్రం చంద్ర వెల్లడించలేదు. ‘స్థూలంగా ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 16.5 శాతంగాను, నికర ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 14.5 శాతంగాను ఉంది. పన్నులు చెల్లించేవారి సంఖ్య పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు తోడ్పడిందనడానికి ఇదే నిదర్శనం‘ అని చంద్ర తెలిపారు. 2016 నవంబర్‌లో కేంద్రం రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న నాలుగు గంటల వ్యవధిలోనే ఎలక్ట్రానిక్‌ రూపంలో పర్మనెంట్‌ అకౌంటు నంబరు (ఈ–పాన్‌) జారీ చేసేందుకు సీబీడీటీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 4 గంటల వ్యవధిలోనే పాన్‌ను జారీ చేయడానికి అవకాశం ఉంది. ఆధార్‌ గుర్తింపు సంఖ్యను సమర్పిస్తే చాలు.. 4 గంటల్లో మీ కు ఈ–పాన్‌ జారీ అవుతుంది‘ అని చంద్ర తెలిపారు.  

ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సాధిస్తాం.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్నట్లుగా రూ. 11.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించగలమని చంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా మొత్తం ప్రత్యక్ష పన్నులకు సంబంధించి బడ్జెట్‌ అంచనాల్లో 48 శాతం వసూలైనట్లు చెప్పారు. 2018–19 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో సీబీడీటీ ఇప్పటిదాకా 2.27 కోట్ల రీఫండ్‌లు జారీ చేసిందని, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చంద్ర చెప్పారు. డీమోనిటైజేషన్‌ అనంతరం కార్పొరేట్‌ ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య 8 లక్షలకు చేరిందన్నారు. గడిచిన నాలుగేళ్లలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య 80 శాతం పైగా పెరిగిందని చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అసెసీలను ట్యాక్స్‌ ఆఫీసులకు పిలిపించకుండా సుమారు 70,000 పైగా కేసులను ఆన్‌లైన్‌లోనే పరిష్కరించినట్లు చెప్పారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి, ఆదాయాలకు రిటర్నులకు పొంతన లేని వారికి సీబీడీటీ దాదాపు 2 కోట్ల ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు చంద్ర చెప్పారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement