2015లో 5-6 శాతం వృద్ధి
మూడీస్ అంచనా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2015లో 5 నుంచి 6 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. దేశీయంగా పటిష్ట డిమాండ్ బేస్, ఎగుమతులు పెరగడానికి ప్రణాళికలు వంటి అంశాలు దీనికి దోహదపడతాయని వివరించింది. ఆయా అంశాలు చైనా, యూరోజోన్, జపాన్ నుంచి ఆర్థికంగా వచ్చే ప్రతికూల ప్రభావాల నుంచి భారత్ తట్టుకునేలా చేస్తామని పేర్కొంది. 2014లో వృద్ధి రేటు దాదాపు 5 శాతం వరకూ ఉంటుందని విశ్లేషించింది. పొదుపు, పెట్టుబడుల రేటు గణనీయంగా ఉండటం భారత్‌కు కలసి వచ్చే అంశంగా వివరించింది. ‘2015 అవుట్‌లుక్-అంతర్జాతీయ స్థాయి రుణ పరిస్థితులు’ శీర్షికన మూడీస్ ఒక నివేదికను విడుదల చేసింది.
ముఖ్యాంశాలు...
⇒ భారత్‌లో ఉపాధి, వినియోగం పెరగనుంది.
⇒అంతర్జాతీయంగా తగ్గిన కమోడిటీ ధరలు దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడతాయి.
⇒ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఉన్నా.. బ్యాంకింగ్ వ్యవస్థకు మాత్రం మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక ప్రతికూలాంశం. కార్పొరేట్ రంగం మందగమనం ఎన్‌పీఏలకు ఒక కారణం. దీనివల్ల బ్యాంకింగ్‌లో ప్రొవిజనింగ్, పటిష్ట మూలధనం నిర్వహణ, ఇందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు అవసరం కొనసాగుతుంది.
⇒భారత్ పటిష్ట ఆర్థికాభివృద్ధికి విధాన సంస్కరణలు దోహదపడతాయి.
⇒దవ్యలోటు, ద్రవ్యోల్బణం, మౌలికరంగం పురోగతి బాట పడితే, భారత్ రేటింగ్‌కు సంబంధించి ఔట్‌లుక్ మెరుగుపడుతుంది.
వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం: సిన్హా
భారత్... 7 నుంచి 8 శ్రేణిలో జీడీపీ వృద్ధి రేటును నమోదుచేసుకోడానికి, అలాగే రానున్న 12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.