వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేయడానికి అనువైన పరిస్థితులు (వ్యాపార సానుకూలతలు) వేగంగా మెరుగుపడుతున్నాయి. గత ఏడాది ఇందుకు సంబంధించి 130గా ఉన్న భారతదేశ ర్యాంక్ ఈ ఏడాది ఒక్కసారిగా 100కు ఎగసింది. ఇది పెద్ద విజయమే. ప్రపంచబ్యాంక్ ఈ మేరకు తాజా నివేదిక విడుదల చేసింది. పన్నులు, లైసెన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది.
డీమోనిటైజేషన్, అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు విషయంలో అస్పష్టత, లొసుగులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో వెలువడిన ఈ ప్రపంచ బ్యాంక్ నివేదిక... కేంద్ర ప్రభుత్వానికి నైతిక బలాన్ని అందించినట్లయింది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ 2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.
♦ అయితే దేశంలోని ప్రజలందరినీ ఒకే పన్ను వ్యవస్థ కిందకు తీసుకువచ్చి, అంతర్రాష్ట్ర వాణిజ్య అడ్డంకులను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్న జీఎస్‌టీ అమలు తదుపరి వ్యాపార పరిస్థితులను మాత్రం ర్యాంకింగ్ పరిగణనలోకి తీసుకోలేదు.
♦ ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
♦ భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.
♦ గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.
♦ ఇబ్బందులులేని వ్యాపార సానుకూల దేశాల నిర్ణయానికి 10 సూచీలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. వీటిలో 8 సూచీలకు సంబంధించి భారత్ తగిన సంస్కరణలను అమలు పరిచింది.
♦ 2016–17లో భారత్‌లో మెరుగుపడిన ఎనిమిది వ్యాపార ప్రమాణాలను పరిశీలిస్తే– ఒక వ్యాపారం సత్వరం ప్రారంభానికి పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇందుకు సంబంధించి సుదీర్ఘ ప్రొసీజరల్ ప్రక్రియ కొంత తగ్గింది. బిల్డింగ్ పర్మిట్ పొందడం సులభతరమైంది. రుణ లభ్యత సరళతరం అయ్యింది. మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు పెద్ద పీట వేయడం జరుగుతోంది. పన్ను చెల్లింపులు తేలికవుతున్నాయి. అంతరాష్ట్ర వాణిజ్యం, కాంట్రాక్టుల నిర్వహణ, దివాలా వంటి అంశాల విషయంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, లావాదేవీల అంశాల్లో ఇంకా భారీ మెరుగుదల రావాల్సి ఉంది.
♦ కొత్త బిజినెస్ రిజిస్ట్రేషన్‌కు 15 ఏళ్ల క్రితం 127 రోజులు పట్టేది. ఇప్పుడు ఈ సమయం 30 రోజులకు తగ్గింది.
♦ ఒక వ్యాపారం ప్రారంభించడానికి సంబంధించిన ప్రక్రియ స్థానిక పెట్టుబడిదారులకు ఇంకా క్లిష్టంగానే ఉంది. క్షిష్టమైన 12 ప్రొసీజర్ల ద్వారా వారు తమ లక్ష్యాలను చేరుకోవాల్సి వస్తోంది.
న్యూజిలాండ్ టాప్...
సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికాది ఈ విషయంలో 6వ స్థానం కాగా, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచింది. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది. 78వ స్థానంతో... బ్రిక్స్ దేశాల్లో చైనా రెండవ స్థానంలో నిలిచింది. 2016లోనూ చైనాది ఇదే ర్యాంక్.
టాప్ 5కి చేరడమే లక్ష్యం..
గడచిన కొన్నాళ్లుగా 130–140 స్థానాల్లో కొనసాగిన భారత్.. ప్రస్తుతం ఏకంగా 30 స్థానాలు ఎగబాకిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఏ దేశం కూడా ఈ స్థాయిలో మెరుగుపడలేదని ఆయన వివరించారు.
ర్యాంకింగ్‌ను మరింతగా మెరుగుపర్చుకునే సత్తా భారత్‌కి ఉందని.. టాప్ 5లోకి చేరడమే లక్ష్యం కావాలని జైట్లీ విలేకరుల సమావేశంలో వివరించారు. వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించే దిశగా ప్రతీ అంశాన్నీ మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని జైట్లీ చెప్పారు. ముఖ్యంగా ట్యాక్సేషన్ విధానంలో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు.
గతేడాది మొత్తం 189 దేశాల జాబితాలో 172వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 53 స్థానాలు పైకి ఎగబాకిందని జైట్లీ చెప్పారు. ఆర్బిట్రేషన్ చట్టం తదితర సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. ఇక ఇన్‌సాల్వెన్సీ పరిష్కారంలో 136వ స్థానంలో ఉండగా.. 33 స్థానాలు మెరుగుపడి 103వ ర్యాంకుకు చేరినట్లు ఆయన తెలిపారు.
భారీ జంప్ ఇది...
ఇది భారీ జంప్. జూలై 1 నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ సంస్కరణను ఈ ఏడాది పరిగణనలోకి తీసుకోలేదు. వచ్చే ఏడాది నివేదికలో ఇది కీలకమవుతుంది. ఇక డీమోనిటైజేషన్‌నూ పరిగణనలోకి తీసుకోలేదు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం ర్యాంకు భారీ పెరుగుదలకు కారణం.
ఈ ఏడాది దేశం తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకున్నా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అందువల్ల ఇప్పుడే భారత్‌ను వ్యాపారానికి అత్యంత సానుకూల ప్రాంతంగా చెప్పలేను. అయితే ఆ హోదాను పొందడానికి తగిన దిశలో పయనిస్తోందని మాత్రం చెప్పగలను. సులభతర వ్యాపార పరిస్థితుల విషయంలో గత రెండేళ్లతో పోల్చితే దేశం ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. – రీటా రమాల్హో, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ తాత్కాలిక డైరెక్టర్
చక్కటి పురోగతి...
గడచిన 15 సంవత్సరాల నుంచీ ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఒక్క ఏడాదిలో భారీగా తమ ర్యాంకును మెరుగుపరచుకున్న దేశాల్లో ఇంతక్రితం జార్జియా, రువాండా వంటి కేవలం ఐదు దేశాలే ఉన్నాయి. భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ ర్యాంక్ ఏదీ ఒక్క ఏడాదిలో ఇంతగా మెరుగుపడలేదు. అయితే వ్యాపార అవకాశాల మెరుగుదలలో భారత్ పయనించాల్సిన బాట ఇంకా ఎంతో ఉంది. – శాంటియాగో క్రౌసీ డౌన్స్, ప్రపంచబ్యాంక్ డూయింగ్ బిజినెస్ యూనిట్ యాక్టింగ్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment