
భారత్‌లో పన్ను వ్యవస్థ సంక్లిష్టం: డెలాయిట్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతి క్లిష్టమైన పన్ను వ్యవస్థను కలిగిన రెండో దేశం భారత్ అని డెలాయిట్ సర్వే స్పష్టం చేసింది. పన్నులకు సంబంధించి క్లిష్టమైన చట్టం కలిగిన దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వరుసగా ఉన్నాయి. చైనా, భారత్ విషయంలో పన్నుల పరంగా జటిలత్వం గత మూడేళ్లలో పెరిగిపోయినట్టు సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైగా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్లిష్టత అంటే పన్ను చట్టాలు, నిబంధనలు అర్థం చేసుకోవడం, వివరించడంలో ఉన్న కఠినత్వం.
సర్వేలో 90 శాతానికి పైగా భారత్, చైనా, ఇండోనేషియాలో పన్ను సంస్కరణలను కోరుకుంటున్నట్టు చెప్పారు. మరీ ముఖ్యంగా భారత్‌లో కాలానుగుణంగా సంస్కరణలు, ఆడిట్లలో నాణ్యత, బీఈపీఎస్ సిఫారసుల అమలును ఆశిస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 300 మందికిపైగా ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను డెలాయిట్ ఈ సర్వేలో భాగంగా సేకరించింది.