
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 20 ఏళ్లలో 8–9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అన్నారు. పెట్టుబడులకు సంబంధించి ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం (చైనాతో పాటు మరో దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు) నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని ఆయన అన్నారు. భారత్ పెద్ద మార్కెట్ అని, ఇక్కడ అందుబాటులో ఉన్నంత స్థాయి, కార్యకలాపాల పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచి్చన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
► అంతరిక్ష రంగం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికే 200 స్టార్టప్‌లు ఉన్నాయి. 2040 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించే అవకాశం ఉంది.
► అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలంటే కనీసం 2047 వరకు 8–9 శాతం వృద్ధిని సాధించాలి. మధ్య ఆదాయ స్థాయి పెరగడం, వేగంతో ఎదగడం అంత సులభం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఏడాది ప్రాతిపదికన 8–9 శాతం వేగం వృద్ధిని నమోదుచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
► వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ వెహికిల్‌సహా ఇతర పురోగతి చెందుతున్న భారత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేíÙంచవచ్చు. దేశం సంవత్సరానికి 16,000–18,000 కిలోమీటర్ల (వేగంతో)మేర రోడ్లను నిర్మిస్తోంది. ఇది మౌలిక రంగం పురోగతికి, ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే అంశం.
► బహుళజాతి కంపెనీలు ’చైనా ప్లస్ వన్’ విధానం వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీలు తమ తయారీని చైనా కాకుండా వేరే చోటికి తరలించాలని నిర్ణయించినప్పుడు ప్రయోజనం పొందే ఇతర దేశాలు ఉన్నప్పటికీ భారత్ మినహా మరే ఇతర దేశానికి అంత స్థాయి, పరిమాణం లేదు.
► ముడిచమురు దిగుమతుల బిల్లే భారత్ అతిపెద్ద సవాలు. సాంకేతికంగా దేశం పురోగమన పథంలో ఉన్నప్పటకీ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.
► ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ గత నెలలో ఒక నివేదిక విడుదల చేస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 3.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2031 నాటికి 6.7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది.