మెట్టు దిగిన భారత్‌ మార్కెట్‌ | India is sixth most promising market in the world, down by one position | Sakshi
Sakshi News home page

మెట్టు దిగిన భారత్‌ మార్కెట్‌

Published Wed, Jan 18 2017 1:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

మెట్టు దిగిన భారత్‌ మార్కెట్‌

మెట్టు దిగిన భారత్‌ మార్కెట్‌

ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి
దేశంలో పెట్టుబడులకు తగ్గిన ఆసక్తి
పీడబ్ల్యూసీ అంతర్జాతీయ సీఈఓల సర్వే


దావోస్‌: అవకాశాలతో భారత్‌ ఊరిస్తోంది. వచ్చే 12 నెలల కాలానికి వృద్ధి అవకాశాలతో అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌లను ఆకర్షిస్తున్న మార్కెట్లలో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. కానీ, ఇది గతేడాది కంటే ఓ మెట్టు తక్కువే. గతేడాది టాప్‌ 5లో భారత్‌కు చోటు లభించింది. వృద్ధికి అవకాశాలున్నా...దేశంలో పెట్టుబడుల ఆసక్తి మూడేళ్లుగా తగ్గిపోయింది. పీడబ్ల్యూసీ నిర్వహించిన వార్షిక అంతర్జాతీయ సీఈవోల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దావోస్‌లో ఈ సంస్థ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది.

అత్యధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్‌గా అమెరికా నంబర్‌ 1 స్థానంలో ఉంది. 43 శాతం సీఈవోలు ఇందుకు అనుకూలంగా ఓటేశారు. చైనా (33 శాతం ఓటు), జర్మనీ (17 శాతం), బ్రిటన్‌ (15 శాతం), జపాన్‌ (8శాతం), ఇండియా (7 శాతం) వరుస స్థానాల్లో ఉన్నాయి. సంస్థాగత సంస్కరణలు నిదానంగా పట్టాలెక్కడం, కరెన్సీ విలువల్లో క్షీణత వంటివి దేశంలో పెట్టుబడుల విషయంలో సీఈవోల ఆసక్తి సన్నగిల్లడానికి కారణాలు. అయితేనేమి, బలమైన వృద్ధి, ద్రవ్య, విధానపరమైన సంస్కరణలతో భారత్‌ టాప్‌ 6లో చోటు దక్కించుకోవడం విశేషం.

ముఖ్యాంశాలు...
తాజా సర్వే ప్రకారం పెట్టుబడులకు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ ప్రాధాన్య దేశాలు కాగా, భారత్, బ్రెజిల్, రష్యా, అర్జెం టీనా విషయంలో పెట్టుబడుల ఆసక్తి తగ్గుముఖం పట్టింది.
ఈ ఏడాదికి సంబంధించి ఎంతో ఆందోళనతో ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సీఈవోలు పేర్కొన్నారు. అయినప్పటికీ 38% సీఈవోలు వచ్చే 12 నెలల కాలంలో తమ కంపెనీల వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు.
ప్రపంచ ఆర్థిక రంగం ఈ ఏడాది పుంజుకుంటుందని 29 శాతం మంది చెప్పారు.
రక్షణాత్మక, వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధి అనే ధోరణి పెరిగిపోతుందన్న ఆందోళన సీఈవోల మాటల్లో వ్యక్తమైంది. 59% మంది రక్షణాత్మక వైఖరి పెరిగిపోతుండటంపై ఆందో ళన వ్యక్తం చేశారు. అమెరికా, మెక్సికోల్లో ఇలా భావిస్తున్న సీఈవోల శాతం 64గా ఉంది. ట్రంప్‌తో తిరోగమనం, బ్రెగ్జిట్‌ ఈయూ నుంచి తప్పుకోవడం వంటి ఆందోళన పరిచే అంశాలున్నప్పటికీ అమెరికా, బ్రిటన్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు ఉండటం ఊరట కలిగించేదే.   

దేశీయ సీఈవోల్లో ఆశావాదం
వచ్చే ఏడాది కాలంలో తమ కంపెనీలు వృద్ధిని కొనసాగిస్తాయన్న నమ్మకాన్ని భారత్‌లో 71 శాతం సీఈవోలు వ్యక్తం చేయడం విశేషం. గతేడాది ఇదే అంశంపై 33 పాయింట్లు రాగా, ఈ ఏడాది సర్వేలో 38 పాయింట్లు వచ్చాయి. ‘‘భారత ఆర్థిక రంగం పట్ల ఉన్న విశ్వాసం తమ కంపెనీలు వృద్ధి చెందుతాయన్న సీఈవోల ఆశావాదంతో ప్రస్ఫుటమైంది. అయితే, నైపుణ్య మానవ వనరుల అందుబాటు, టెక్నాలజీల కారణంగా ఎదురవుతున్న నష్టం అనేవి ఆందోళన కలిగించే అంశాలు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్‌ శ్యామల్‌ ముఖర్జీ అన్నారు.

అసమానతలు పెరిగాయ్‌: మిట్టల్‌
కంపెనీలు సమాజం వైపూ చూడాలని సూచన
దావోస్‌: గత దశాబ్ద కాలంలో అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయని ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్‌ మిట్టల్‌ అన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశంలో భాగంగా ‘భవిష్యత్‌ భారీ వ్యాపారాలు’ అన్న అంశంపై మిట్టల్‌ ప్రసంగించారు. దాతృత్వ కార్యక్రమాలు కంపెనీలను వినియోగదారులకు చేరువ చేస్తాయన్నారు. ‘‘నేడు ప్రపంచం ఉద్యోగాల్లేని వృద్ధిని చూస్తోంది. దాతృత్వ కార్యక్రమాలు హృదయానికి సంబంధించినవే. కానీ, వీటి వల్ల వినియోగదారులు మిమ్మల్ని మరింత సానుకూలంగా చూస్తారు. భారత్‌లో కంపెనీలు తమ లాభాల్లో 2% నిధులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అని మిట్టల్‌ తెలిపారు.

కొత్త ఆవిష్కరణలతో అవకాశాలు: గుర్నానీ
ఆధునిక ఆవిష్కరణలైన ఆటోమేషన్‌ (యాంత్రీకరణ), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ స్సు)లను అవకాశాలుగా మలుచుకోవాలని ప్రముఖ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా సీఈవో అయిన సీపీ గుర్నానీ సూచించారు. అయితే, ఈ విభాగాలకు సంబంధించిన నైపుణ్యాలను అలవరుచుకోవడమే ఓ సవాల్‌ వంటిదన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఎవరైనా అనుసరించకుంటే వారు ఇంటెలిజెంట్‌ కారని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, నూతన ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయన్న మాటలను ఆయన కొట్టిపడేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement