ఓ స్టార్టప్ పేజీని.. ఫేస్ బుక్ తీసేసింది! | India Startup Cut off From Facebook After U.S. Rival's Protest | Sakshi
Sakshi News home page

ఓ స్టార్టప్ పేజీని.. ఫేస్ బుక్ తీసేసింది!

Published Thu, Mar 10 2016 12:35 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఓ స్టార్టప్ పేజీని.. ఫేస్ బుక్ తీసేసింది! - Sakshi

ఓ స్టార్టప్ పేజీని.. ఫేస్ బుక్ తీసేసింది!

అమెరికా సంస్థ ‘హౌజ్’ పక్షాన ఎఫ్‌బీ ఏకపక్ష చర్య
హౌజిఫై సంస్థ పేజీ చెప్పాపెట్టకుండా ఏకపక్షంగా తొలగింపు
దర్యాప్తు జరుగుతోంది; అంతకన్నా చెప్పలేం: ఫేస్‌బుక్
జడ్జి పాత్ర పోషించటమేంటంటూ స్టార్టప్‌లలో ఆందోళన

 న్యూయార్క్: దేశంలో ఫేస్‌బుక్‌ను వాడుతున్నవారి సంఖ్య 14.2 కోట్ల పైనే. వీరిలో వ్యక్తులు, కంపెనీలే కాదు..! వ్యక్తులు నడిపిస్తున్న బిజినెస్‌లూ ఉన్నాయి. మీ పేజీ తెరవాలంటే ఐడీ, పాస్‌వర్డ్ మీ దగ్గరే ఉంటుంది. మరి మీ పేజీ మీకు తెలియకుండానే డిలీట్ అయిపోతే..? మీకు చెప్పకుండా ఫేస్‌బుక్కే దాన్ని తీసి పారేస్తే..? దేశీ స్టార్టప్ కంపెనీ ‘హౌజిఫై’ విషయంలో ఇదే జరిగింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్, ఇన్‌మొబి వ్యవస్థాపకుడు నవీన్ తివారీ తదితరులు పెట్టుబడి పెట్టిన ‘హౌజిఫై’కి అమెరికాకు చెందిన ‘హౌజ్’ సంస్థతో ట్రేడ్‌మార్క్ వివాదముంది.

తమలాంటి పేరునే వాడారని, ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించారని పేర్కొంటూ డిసెంబర్లో ‘హౌజిఫై’కి ‘హౌజ్’ సంస్థ నోటీసులిచ్చింది కూడా. అయితే హౌజ్ అనేది జనరిక్ పేరని, దీనికి ఇఫీ చేర్చామని, ఇవి రెండూ జనరిక్ పదాలే కనక ట్రేడ్‌మార్క్ ప్రశ్నే తలెత్తదని హౌజిఫై చెబుతోంది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే... ఉన్నట్టుండి హౌజిఫై పేజీని ఫేస్‌బుక్ తొలగించింది. హౌజిఫైలో ఫేస్‌బుక్ లింక్‌ను క్లిక్ చేసినవారికి... ‘ఈ లింక్ తెగిపోయింది.. లేదా తొలగించడం జరిగింది’ అనే మెసేజ్ మాత్రం వస్తోంది. దీనిపై హౌజిఫై నిర్ఘాంతపోయింది. ఫేస్‌బుక్ ఇలా చెప్పా పెట్టకుండా ఏకపక్షంగా పేజీని తొలగించటం సరైన చర్య కాదని వాపోయింది. ఫేస్‌బుక్ ఇండియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... దీనిపై దర్యాప్తు జరుగుతోందని, అంతకన్నా ఏమీ చెప్పలేమనటం గమనార్హం.

 స్టార్టప్‌ల ఆందోళన...
హౌజిఫై విషయంలో ఇలా జరగటంపై స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫ్రీబేసిక్స్ ద్వారా కావాల్సినంత అపఖ్యాతిని మూటగట్టుకున్న ఫేస్‌బుక్.. ఇలా ఏకపక్షంగా పేజీని తొలగించటం ద్వారా మరిన్ని వివాదాలకు కారణమైందని వారు అభిప్రాయపడ్డారు. నిజానికి హౌజిఫై గానీ, అమెరికాలోని హౌజ్ గానీ రెండూ... సొంతింటి యజమానుల్ని, ఇంటీరియర్ డిజైనర్లను కలిపే సంస్థలే. హౌజ్‌కు అమెరికాలో 3.5 కోట్ల మంది కస్టమర్లు ఉండగా... హౌజిఫైకి ఇండియాలో 1.2 లక్షల మంది కస్టమర్లున్నారు. హౌజ్‌లో సెకోయా క్యాపిటల్, డీఎస్‌టీ గ్లోబల్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేయగా... హౌజిఫైలో దేశీ ప్రముఖులు చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ‘‘మా వ్యాపార ప్రచారం ప్రధానంగా ఫేస్‌బుక్ ద్వారానే జరుగుతోంది.

దాన్లో మాకు 56వేల మంది ఫాలోవర్లున్నారు. ఇరు సంస్థల మధ్యా వివాదం ఉన్నపుడు ఇద్దరి వాదనా తెలుసుకోవాలి. కానీ చెప్పాపెట్టకుండా మా పేజీ తొలగించటం అన్యాయం’’ అని హౌజిఫై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గుణశీలన్ రాధాకృష్ణన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫేస్‌బుక్ ఏకంగా జడ్జి పాత్ర పోషించిందంటూ పలువురు మండిపడ్డారు. చాలా స్టార్టప్‌లకు ప్రధాన ప్రచార మాధ్యమం ఫేస్‌బుక్కేనని, ఈ చర్య అందరినీ బెదిరించేటట్టుగా ఉందని గుణశీలన్ చెప్పారు. ‘‘దీనికి ఫేస్‌బుక్కే బాధ్యత వహించాలి. ఎందుకంటే జడ్జి మాదిరి న్యాయమేదో అన్యాయమేదో అదే చెప్పటంతో పాటు శిక్ష కూడా అదే విధించేసింది’’ అని లాజిస్టిక్స్ సంస్థ ‘డెలివరీ’ సీఈఓ సాహిల్ బారువా అభిప్రాయపడ్డారు. ఇపుడు హౌజ్ పక్షాన నిలిచిందని, తరవాత మరో దిగ్గజంవైపు నిలిచి చిన్న స్టార్టప్‌ను చిదిమేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement