మార్కెట్ పంచాంగం
అంతర్జాతీయ మార్కెట్ ముఖ్యంగా అమెరికా, యూరప్ సూచీలు గతవారం నాటకీయంగా డౌన్‌ట్రెండ్‌లోకి మళ్ళాయి. మరికొద్దికాలం వడ్డీ రేట్లు కనిష్టస్థాయిలో కొనసాగుతాయంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన తర్వాతే తాజా డౌన్‌ట్రెండ్‌కు బీజం పడినందున, ఇక ఆ మార్కెట్లలో సంవత్సరాంతపు లాభాల స్వీకరణ ప్రారంభమైనట్లు భావించాలి. ఈ ఏడాది సెప్టెంబర్ మాసాంతంవరకూ మన మార్కెట్లానే అక్కడి సూచీలు కూడా పెద్ద ర్యాలీ జరిపాయి.
భారత్ సూచీల ర్యాలీ మోదీ అనుకూల ప్రభంజనంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీలో భాగంగానే సెన్సెక్స్, నిఫ్టీల అప్‌ట్రెండ్ కొనసాగినట్లు ఆయా షేర్ల కదలికలు చెపుతున్నాయి. ఎందుకంటే అక్కడితరహాలోనే ఇక్కడ కూడా ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లే సూచీలను కొత్త గరిష్టస్థాయిలకు తీసుకువెళ్లాయి. భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఇన్‌ఫ్రా, పవర్, రియల్టీ, పీఎస్‌యూ షేర్లు ఇంకా 2008 సంవత్సరపు కనిష్టస్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల తరహాలోనే ఇక్కడి సూచీల ట్రెండ్ కూడా మారుతుందా? లేక వాటికి భిన్నంగా అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తాయా? ఈ ప్రశ్నలకు ఈ వారం సమాధానం లభించవొచ్చు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు..
అక్టోబర్ 10తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో 26,688-26,150 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 271 పాయింట్ల నష్టంతో 26,297 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ క్రాష్ అయిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్ డౌన్‌తో మొదలైతే 26,040 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఆ లోపున ముగిస్తే మార్కెట్లో కరెక్షన్ కొద్దివారాలు కొనసాగవచ్చు. 26,040 దిగువన మద్దతుస్థాయిలు 25,945, 25,790 పాయింట్లు. ఈ చివరి మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే కొద్దివారాల్లో క్రమేపీ 25,230 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే 26,450 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన అవరోధస్థాయిలు 26,670, 26,850 పాయింట్లు.
నిఫ్టీ మద్దతు 7,810-నిరోధం 7,925
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,972-7,815 పాయిట్ల మధ్య 150 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 85 పాయింట్ల నష్టంతో 7,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ మొదలైతే 7,810 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. 7,810-7,850 శ్రేణిలో పలు సపోర్ట్ లేయర్స్ వున్నందున, సమీప భవిష్యత్తులో అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే నిఫ్టీ 7,810 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకోవాల్సివుంటుంది.
ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టీ క్రమేపీ బలహీనపడవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 7,740 స్థాయికి, ఆ లోపున 7,700 వద్దకు పడిపోవొచ్చు. కొద్దిరోజుల్లో క్రమేపీ 7,540 పాయింట్ల వద్దకు క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం నిఫ్టీ తొలి స్థాయి వద్ద మద్దతు పొందగలిగితే 7,925 పాయింట్ల నిరోధస్థాయికి పెరగవచ్చు. అటుపైన 8,000 స్థాయిని చేరవచ్చు. సెప్టెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు 8,000పైన అధిక ట్రేడింగ్ పరిమాణంతో నిఫ్టీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నందున, ఈ స్థాయిని పటిష్టంగా ఛేదించగలిగితేనే సూచీ తిరిగి 8,180 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని పరీక్షించే అవకాశం వుంటుంది.
తక్షణ మద్దతు 26,040
Published Mon, Oct 13 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement