భారత్ పరిస్థితి భేష్: ఎస్‌అండ్‌పీ
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తోందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) పేర్కొంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో సంస్కరణల ప్రక్రియ జోరందుకుందని పేర్కొంది. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, బీమా రంగంలో సంస్కరణలకు ప్రయత్నం, ప్రభుత్వ వ్యయాలు తగ్గింపునకు కృషి ద్వారా ద్రవ్యలోటు కట్టడి చర్యలు వంటి అంశాలను ఈ సందర్భంగా ఎస్‌అండ్‌పీ ప్రస్తావించింది.
7% జీడీపీ వృద్ధి దిశగా విశ్వాసం గణనీయంగా మెరుగుపడినట్లు విశ్లేషించింది. ఇదే ప్రాంతంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు 2014 చివరినాటికి ఊహించినదానికన్నా పేలవ పనితీరును నమోదు చేసుకుంటున్నాయని పేర్కొంది. చైనా వృద్ధి మందగించిందని, జపాన్ మాంద్యంలోకి జారిపోయిందని పేర్కొంది. అమెరికా పటిష్ట రికవరీ ఎగుమతుల రంగానికి సానుకూల అంశమని పేర్కొంది.