
న్యూఢిల్లీ : భారత బ్యాంక్ కస్టమర్లకు చెందిన 13 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక డేటా డార్క్ వెబ్‌లో బహిరంగ అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీటి అమ్మకంతో సైబర్ క్రిమినల్స్ 130 మిలియన్ డాలర్లు సొమ్ము చేసుకునేందుకు లక్షలాది బ్యాంకు కస్టమర్ల కీలక డేటాను అమ్మకానికి పెట్టారు. జడ్‌డీనెట్ అందించిన వివరాల ప్రకారం దేశీ కస్టమర్లకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు జోకర్స్ స్టాష్‌లో అందుబాటులో ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని పురాతన కార్డ్ షాపులలో ఒకటైన జోకర్స్‌స్టాష్ ప్రధాన హ్యాకర్లు కార్డ్ డంప్‌లను విక్రయించే ప్రదేశంగా ప్రసిద్ది చెందింది. అనైతిక కార్యకలాపాలు సాగించేందుకు ఐపీ అడ్రస్ పసిగట్టకుండా వెబ్ మాఫియా డార్క్ వెబ్‌ను అడ్డాగా చేసుకుని చెలరేగుతోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డార్క్ వెబ్‌లో జోకర్స్ స్టాష్ ఇండియా మిక్స్ న్యూ-01 అనే శీర్షికతో ప్రకటన ఇస్తోందని సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీఏకు చెందిన పరిశోధకులు గుర్తించారు. భారత్‌కు చెందిన పలు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను ఒక్కోటి రూ 100 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కార్డ్ డంప్‌గా సెక్యూరిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) సిస్టమ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్కిమ్మింగ్ పరికరాలతో కార్డు వివరాలను హ్యాకర్లు రాబడుతున్నట్టు డేటా అనాలిసిస్ ద్వారా గుర్తించామని ఆ నివేదికలో పరిశోధకులు తెలిపారు.
జోకర్స్ స్టాష్ నుంచి కార్డు వివరాలను కొనుగోలు చేసిన నేరగాళ్లు వాటి ఆ వివరాలతో క్లోనింగ్ ద్వారా సరైన కార్డులు రూపొందించి ఏటీఎంల నుంచి దర్జాగా నగదు విత్‌డ్రా చేస్తారు. ఫిబ్రవరిలో జోకర్స్ స్టాష్‌లో 25 లక్షల మంది అమెరికన్ల కార్డు వివరాలు అమ్మకానికి పెట్టారు. గత ఐదేళ్లుగా టార్గెట్, వాల్‌మార్ట్, లార్డ్ అండ్ టేలర్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి కంపెనీల నుంచి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ దొంగిలించిన క్రెడిట్ కార్డుల డేటాను విక్రయిస్తూ ప్రముఖ అండర్‌గ్రౌండ్ క్రెడిట్ కార్డు షాప్‌గా పేరొందింది. దీనివద్ద 53 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు ఉన్నట్టు సైబర్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment