హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మా రంగం మంచి జోరు మీద ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో దేశం నుంచి ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. 2018తో పోలిస్తే 2019 ఆగస్టులో ఎక్స్‌పోర్ట్స్ 0.19 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబరు నెలలో ఎగుమతులు గాడినపడ్డాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్ 8.72 శాతం అధికమై రూ.12,600 కోట్లకు చేరుకున్నాయి. జూలైలో ఏకంగా 21.74 శాతం అధికమై రూ.12,047 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబరు క్వార్టరులో 9.37 శాతం వృద్ధితో రూ.36,442 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. కాగా, మార్కెట్ రిసర్స్ సంస్థ ఏఐవోసీడీ–అవాక్స్ ప్రకారం సెప్టెంబరు క్వార్టరులో దేశీయ ఔషధ పరిశ్రమ 11.5 శాతం వృద్ధి సాధించింది.
22 బిలియన్ డాలర్ల దిశగా..
ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు రెండంకెల వృద్ధి సాధించాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్ 10.28% అధికమై రూ.71,694 కోట్లకు చేరుకున్నాయి. 2019–20లో ఎగుమతులు 22 బిలియన్ డాలర్లు (రూ.1,54,000 కోట్లు) నమోదు చేస్తాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మెక్సిల్) అంచనా వేసింది. ద్వితీయార్థంలోనూ పరిశ్రమ రెండంకెల వృద్ధి సాధిస్తుందని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. దీంతో అంచనాలకు తగ్గట్టుగా ఎగుమతులు నమోదవుతాయని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎక్స్‌పోర్ట్స్ రూ.1,33,980 కోట్లు. ఆరోగ్య సేవలపై వ్యయం తగ్గించుకోవడానికి చాలా దేశాలు తక్కువ ధరలో లభించే జనరిక్ డ్రగ్స్‌కు మళ్లుతున్నాయి. అలాగే యూఎస్ మార్కెట్ రికవరీ, ధరలు స్థిరపడడం, చైనా నియంత్రణ పరమైన నిర్ణయాలు ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేయనున్నాయని రవి ఉదయ భాస్కర్ తెలిపారు.
మోస్తరుగా లాభాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో ఫార్మా కంపెనీల లాభాలు మోస్తరుగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంత క్రితం మూడు త్రైమాసికాలు లాభాల్లో వృద్ధి కొనసాగింది. అమ్మకాల్లో 9–12 శాతం వృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులకు ప్రధాన కేంద్రం అయిన యూఎస్ మార్కెట్ 10–11 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త ఉత్పత్తుల అనుమతులు తగ్గడం యూఎస్ అమ్మకాలపై ప్రభావం చూపనుంది. ఇక డాక్టర్ రెడ్డీస్‌కు అయిదారు కొత్త ఉత్పత్తుల అమ్మకాలు తోడు కానున్నాయి.
మార్చి త్రైమాసికంలో దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సన్ ఫార్మాకు కలిసిరానుంది. సెన్సిపార్ జనరిక్ డ్రగ్స్‌కు పోటీ పెరగడంతో దీని ప్రభావం సిప్లాపై ఉండనుంది. పెగ్‌ఫిల్‌గ్రాస్టిక్ అనే ఔషధం బయోకాన్ అమ్మకాలు పెరిగేందుకు తోడవనుంది. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా, ఐపీసీఏ వంటి కంపెనీలకు దేశీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపనుంది. యూఎస్‌లో ధర నియంత్రణలతో ఈ కంపెనీల మార్జిన్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు నియంత్రణ సంస్థల అడ్డంకులనూ ఇవి ఎదుర్కొంటున్నాయి. టోరెంట్, అరబిందో, గ్లెన్‌మార్క్, లుపిన్ వంటి సంస్థలు వార్నింగ్ లెటర్లను అందుకున్నాయి.
ఫార్మా ఎగుమతులు జూమ్
Published Fri, Nov 1 2019 3:34 AM | Last Updated on Fri, Nov 1 2019 3:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment