న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నియంత్రిత మార్కెట్లకు పెరుగుతున్న ఎగుమతులు, దేశీయంగా స్థిరమైన వృద్ధి నమోదవుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
దీని కోసం 186 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం చేసింది. రూ. 3.7 లక్షల కోట్ల పరిశ్రమ వార్షిక ఆదాయంలో వీటి వాటా దాదాపు సగం ఉంటుంది. నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) అనుమతించిన మేరకు ధరలను పెంచడం కూడా పరిశ్రమ ఆదాయ వృద్ధికి దోహదపడగలదని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ డానీ తెలిపారు.
అమ్మకాల పరిమాణం 3–4% మేర పెరిగేందుకు ప్రస్తుతమున్నవి, కొత్తగా ప్రవేశపెట్టే ఔషధాలు తోడ్పడగలవని వివరించారు. ముడివస్తువులు, లాజిస్టిక్స్ వ్యయాలు, అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిడి తగ్గుదలతో ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహణ లాభదాయకత 50–100 బేసిస్ పాయింట్లు పెరిగి 21 శాతానికి చేరవచ్చని తెలిపారు.
అమెరికాలో ధరలపరమైన ఒత్తిడి, ముడి వ్యయాల పెరుగుదల కారణంగా వరుసగా రెండేళ్ల పాటు మార్జిన్లు తగ్గినట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది. ‘ఆసియాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఒక మోస్తరుగా ఉండగా, ఈసా రి మెరుగుపడవచ్చు. ఆఫ్రికా దేశాల దగ్గర విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వంటి అంశాల కారణంగా అక్కడికి ఎగుమతుల్లో మందగమనం కొనసాగే అవకాశం ఉంది‘ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment